CM Chandrababu
సూపర్ ఎక్స్‌క్లూజివ్

CM Chandrababu: హెచ్‌సీయూ బిల్లి రావు టు ‘ఉర్సా’.. చంద్రబాబు మార్క్ బిజినెస్!

– రహేజా పార్క్ వయా బిల్లి రావు
– సుజనా ఫేక్ కంపెనీస్ లాంటి వ్యవహారాలే ఇప్పుడు మళ్లీ!
– లెక్కలు పక్కాగా దొరకకుండా!
– సిస్టమ్‌ను మేనేజ్ చేసేలా!
– అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ టు సేమ్


CM Chandrababu: నారా చంద్రబాబు.. అంటే టక్కున గుర్తొచ్చేది విజనరీ లీడర్, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్. ఇదంతా ఒకప్పుడు మాత్రమే. రానురానూ పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాబు చేసిన తన మార్క్ బిజినెస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేనండోయ్ రహేజా పార్క్ వయా హెచ్‌సీయూ బిల్లి రావు, సుజనా ఫేక్ కంపెనీస్ లాంటి వ్యవహారాలు గుర్తున్నాయ్ కదా. అదేనండోయ్ 20 ఏళ్ల కిందట హెచ్‌సీయూ భూములను బిల్లీ రావుకు చెందిన ఐదు రోజుల ఫేక్ కంపెనీ ‘ఐఎంజీ భారత్’కు ఇచ్చినట్టు ఇప్పుడు సేమ్ అలాగే రెండు నెలల ఫేక్ కంపెనీ ఉర్సా ఐటీకి విశాఖపట్నంలో రూ.3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే ఇచ్చేశారు. దీంతో ఎన్నేళ్ళైనా బాబు మారలేదని, అచ్చుగుద్దినట్లుగా నాటి రోజులను ఇప్పుడు మళ్లీ షురూ చేసేశారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కంపెనీలకు లెక్కలు మాత్రం పక్కాగా ఎక్కడా దొరకవ్. ఎందుకంటే ఆ రేంజిలో వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేసేస్తారని పేరు గట్టిగానే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ సేమ్ టూ సేమ్ పరిస్థితులు వచ్చేశాయ్. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఉర్సా కంపెనీ. గల్లీ నుంచి యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ కంపెనీ గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రెండంటే రెండు నెలల క్రితం అంటే అప్పుడే పుట్టిన ఉర్సా (URSA) ఐటీ కంపెనీకి సుమారు రూ.3 వేల కోట్ల విలువ చేసే 60 ఎకరాల భూమి, అందులోనూ వైజాగ్‌ లాంటి పెద్ద సిటీలో కేవలం 99 పైసలకే కారుచౌకగా కేటాయించడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. అత్యంత విలువైన ఐటీ హిల్‌ నెంబర్‌ 03లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రి మండలి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. వాస్తవానికి విశాఖ మధురవాడ, కాపులుప్పాడలో ఎకరా తక్కువలో తక్కువ రూ.50 కోట్లపైనే పలుకుతుండగా, అప్పుడే పుట్టిన ఉర్సా ఐటీ కంపెనీకి అతి తక్కువ ధరకు కేటాయింపులు జరగడం చర్చనీయాంశమైంది.

ఉర్సా కంపెనీ కథేంటి?


శంషాబాద్‌ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టులో మేనేజర్‌గా పనిచేస్తున్న పెందుర్తి విజయ కుమార్, అమెరికాలో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ అబ్బూరి కలిసి కేవలం రూ.9.10 లక్షల మూలధనంతో ‘ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్‌ లయబిలిటీ’ కంపెనీ కింద ఫిబ్రవరి 12, 2025న హైదరాబాద్‌ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ‘ఇండియా ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే 2024 సెప్టెంబర్‌ 27న రిజిస్టర్‌ చేశారు. ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అడ్రస్‌గా ప్లాట్‌ నెంబర్‌ 705 ఏక్తా బాసిల్‌ హైట్స్‌ కొత్తగూడ, హైదరాబాద్‌, తెలంగాణ 500084. ఒక రెసిడెన్షియల్‌ అపార్ట్మెంట్‌లో ప్లాట్‌ను చూపించడం, అందులోనూ ఆ ఫ్లాట్‌లో దుస్తులు ఆరేసినట్లు, అసలు కంపెనీలాగా లేకపోవడం, ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండటంతో సామాన్యుడికి సైతం లేనిపోని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, కంపెనీ ఏర్పాటై 2 నెలలు కూడా గడవక ముందే ఏప్రిల్‌ 15న భూ కేటాయింపులు జరిగిపోయాయి. అదికూడా అడక్కుండానే ఎకరా 99 పైసలకే చంద్రబాబు సర్కార్ కేటాయించింది. ఇదేంటి నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీకి ఎలా ఇస్తారని ప్రశ్నలు వెల్లువెత్తడంతో, అబ్బే అదేమీ లేదని ఆ భూములన్నీ టీసీఎస్‌ (TCS) కు ఇచ్చామని తప్పించుకునే ప్లాన్‌ చేస్తుండటం గమనార్హం. మొత్తానికి చూస్తే టీసీఎస్ ముసుగులో కారు చౌకగా అస్మదీయ సంస్థలకు చంద్రబాబు సర్కారు భూ కేటాయింపులు జరిపేసిందని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కనీసం కంపెనీ ఆఫీస్‌, ఫోన్‌ నెంబర్‌, అఫీషియల్ వెబ్‌సైట్‌ కూడా లేని కంపెనీకి వందల కోట్ల విలువ చేసే భూములు, వేల కోట్ల విలువైన ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఇవ్వడమేంటి అని పలు సందేహాలకు దారి తీస్తున్నది. ఇవన్నీ ఒకెత్తయితే టీసీఎస్‌కు 21.16 ఎకరాలు ఇవ్వడం, డేటా సెంటర్‌ పేరుతో ఉర్సా క్లస్టర్‌కు 60 ఎకరాలు ఇవ్వడం మతలబు ఏంటో, బాబు మార్క్ బిజినెస్ ఏంటనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

మరికొన్ని కంపెనీలు?

ఉర్సా లాంటి కంపెనీల బాటలో మరికొన్నింటికి కూడా కారు చౌకగా భూకేటాయింపులు జరిగాయి. 2 నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్‌ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో సుమారు రూ.10వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని ఐదో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఆమోదం తెలపడం గమనార్హం. అయితే, ఈ కంపెనీలో (రామోజీరావు కుమారుడు కిరణ్ వియ్యంకుడుకు చెందిన) నవయుగ గ్రూపు చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. మరోవైపు, డిసెంబర్‌లో రాష్ట్ర ప్రతినిధులను కలిసి వెళ్లాక జనవరి 3న ఇండిచిప్‌ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ఓర్వకల్లు సెజ్‌లో కారుచౌకగా వందల ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధమైంది. అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే కేటాయిస్తూ మంత్రి మండలి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోవడం వెనుక కచ్చితంగా కుట్రలో భాగమేననే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కంపెనీల ప్రమోటర్లు, వారి వెనుక ఉన్న శక్తులను చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే, ‘కంపెనీ పెట్టు.. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో, వందల ఎకరాల భూమి తీసుకో’ ఇప్పుడిదే ఏపీలో జరుగుతున్న తీరుగా ఉంది.

చవక.. చాలా చవక!

పాత సినిమా శ్రీకృష్ణ తులభారంలో ‘భలే మంచి చౌక బేరము’ పాట గుర్తుంది కదా. అచ్చం ఇప్పుడు ఏపీలో ‘చవక.. చాలా చవక’ అనే ట్రెండ్ నడుస్తున్నది. ముందుగా టీసీఎస్ లాంటి కంపెనీకి మందు విశాఖలో భూములు చవకగా కట్టబెట్టి, అనంతరం సూట్ కేసు కంపెనీలకు వేల కోట్ల రూపాయలు విలువైన విశాఖ భూములు దోచి పెట్టాలి ఇదే కూటమి ప్రభుత్వ తీరు అని సర్కార్‌ను ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. అయితే, ఏపీనే అనుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. దావోస్‌లో ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రపంచ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్‌ లయబిలిటీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. రాష్ట్రంలో 100 మెగావాట్‌ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రూ.5 వేల కోట్ల పెట్టుబడి కుదుర్చుకునే నాటికి ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కనీసం ఏర్పాటు కూడా కాలేదు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు రెండూ ఆ ఉర్సా కంపెనీకి ఈ రేంజిలో ప్రాధాన్యత ఇస్తున్నాయంటే అసలు ఈ కంపెనీకి భూములు ఇవ్వాలని ప్రభుత్వాలు ఎందుకు భావించాయి? రెండు నెలలు వయసున్న కంపెనీని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకు నమ్మాయి? ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పినదెవరు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? చంద్రబాబుకు ఇవన్నీ తెలిసే జరుగుతున్నాయా? లేదా మూడో కంటికి తెలియకుండా కావాల్సినవాళ్లకు సర్దేస్తున్నారా? విశాఖపట్నం లాంటి అద్భుతమైన నగరంలో 21 ఎకరాలు 99 పైసలకు ఎలా అమ్మారు? మరి మైక్రోసాఫ్ట్, విప్రో లాంటి కంపెనీలకు కూడా ఇదే 99 పైసలుకు అమ్ముతారా? అనే సందేహాలు, అంతకుమించి ప్రశ్నలు రాష్ట్ర మేధావులు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..