There Is No Clear Close Challenger To The Bjp This Time Ifs Buts Apply
సూపర్ ఎక్స్‌క్లూజివ్

BJP : ఓవర్ కాన్ఫిడెన్స్..!?

– తమిళనాట అతిగా ఆశ పడుతున్న బీజేపీ
– సరైన క్యాడర్ లేకుండా అత్యధిక సీట్లు సాధ్యమేనా?
– అన్నామలైనే నమ్ముకుని ముందుకు!
– తమిళ గడ్డపై బలంగా ఇండియా కూటమి
– బీజేపీకి అంత సీన్ లేదని తేల్చేసిన డీఎంకే
– సెంటిమెంట్ కుట్రలను తిప్పికొడతామని ధీమా


BJP Tamil nadu latest news(Politics news today India): పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు అంటారు. కానీ, ఏం పోగొట్టుకోకుండానే తమిళనాట బీజేపీ తెగ వెతుకుతోంది. ఈసారి అత్యధిక సీట్లు సాధిస్తామని గొప్పలకు పోతోంది. నిజానికి బీజేపీకి అంత సీన్ ఉందా అంటే అనేక డౌట్స్ రాక మానవు. తమిళనాడులో మొదట కాంగ్రెస్ హవా ఉండేది. ఎప్పుడైతే డీఎంకే స్థాపన, తర్వాత అన్నా డీఎంకే ఆవిర్భావం అక్కడి ప్రజలకు జాతీయ పార్టీలను దూరం చేశాయి. దీంతో ఈ రెండు పార్టీలతోనే కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటూ వచ్చాయి. ఇప్పటికీ అదే చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌కు ఉన్నంత బలం, బలగం బీజేపీకి లేదు. కానీ, కమలనాథులు మాత్రం దీన్ని ఒప్పుకోరు. ఈసారి పక్కాగా ప్రాంతీయ పార్టీలను కాదని ప్రజలు తమకే అత్యధిక లోక్ సభ సీట్లు ఇస్తారని నమ్మకంగా చెబుతోంది. కానీ, ఇది జరిగే పని కాదనేది రాజకీయ పండితుల వాదన.

పొత్తులతోనే తేలిపోయిందా..?


తమిళనాడులో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. డీఎంకే ఇండియా కూటమిలో భాగస్వామి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తును కొనసాగిస్తోంది. మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే, డీఎండీకేతోపాటు మరో రెండు పార్టీలతో జట్టు కట్టింది. బీజేపీతో పీఎంకే మినహా చెప్పుకోదగ్గ పార్టీలేవీ లేవు. ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే 22 స్థానాల్లో పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 సీట్లను కేటాయించింది. ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ 19 స్థానాలు, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే, 2, మరో 5 పార్టీలకు ఒక్కొకటి చొప్పున కేటాయింపులు జరిగాయి. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ, అంతగా ప్రభావం చూపలేదు. ఘోరంగా విఫలమయ్యాయి. డీఎంకే కూటమి 38 స్థానాలను కైవసం చేసుకుంది. ఈసారి బీజేపీ, అన్నా డీఎంకే విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇది ఇండియా కూటమికి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.

అన్నామలై మీదే ఆశ.. కానీ!

నాస్తిక వాదానికి తమిళ గడ్డపై కాలం చెల్లిందంటూ డీఎంకేని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. నేరస్థులకు సింహస్వప్నంగా పేరు పొందిన ఈ తమిళ సింగం, రాజకీయాల్లోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. బీజేపీ ఆశలన్నీ ఈయన మీదే పెట్టుకుంది. కానీ, అన్నామలై ఒక్కరి వల్లే అత్యధిక సీట్లు సాధించడం కష్టమైన పని. అదీగాక, బలమైన ఇండియా కూటమిని దాటుకుని సత్తా చాటడం అంటే అంత ఈజీ కాదు. చేరికలపై అనేక ఆశలు పెట్టుకున్నా, అంతగా వర్కవుట్ కాలేదు. గత ఎన్నికల్లో ఇండియా కూటమికి 53 శాతం ఓట్లు రాగా, ఎన్డీఏకి కేవలం 10 శాతమే వచ్చాయి. అయితే, ఈసారి అన్నా డీఎంకే ఓట్లు తమ వైపు మళ్లుతాయని అనుకుంటోంది. కానీ, ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందనేది పెద్ద ప్రశ్నే.

సెంటిమెంట్‌కు తమిళ ప్రజలు కరుగుతారా?

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టారు మోడీ. దీనికి కారణం కర్ణాటకలో తగ్గుతున్న ప్రాభవమనే ప్రచారం ఉంది. అక్కడ జరుగుతున్న నష్టాన్ని ఇక్కడ పూడ్చుకోవాలని సెంటిమెంట్ రాజకీయాలకు తెర తీశారని అంతా అనుకుంటున్నారు. వారణాసిలో తమిళ-కాశీ సంగమం వేడుకలు, పార్లమెంట్ భవనంలో సెంగోలును మోడీ చేతబట్టడం, ఎప్పటికైనా తమిళ వ్యక్తి ప్రధాని అవుతారని అమిత్ షా చెప్పడం, ఇలా అన్నీ తమిళ ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్లాన్‌లో భాగంగా కనిపిస్తున్నాయి. వీటికితోడు ఈ మధ్య కచ్చతీవు వివాదాన్ని తెరపైకి తెచ్చి డీఎంకేను బద్నాం చేయాలని చూడడం సెంటిమెంట్ రగిలించే ప్రయత్నంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే, కచ్చతీవు ముగిసిపోయిన అధ్యాయం. అది ప్రస్తుతం శ్రీలంక ప్రాపర్టీ. కావాలనే ఎన్నికల సమయంలో దానిపై పదేపదే బీజేపీ ప్రస్తావించడం వల్ల యూజ్ ఉండదనేది అధికార డీఎంకే వాదన. ముమ్మాటికీ తమిళ గడ్డపై బీజేపీ ఎదుగుదల జరగదని ఆపార్టీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే, రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఇదే మాట వినిపిస్తోంది. తమిళనాట బీజేపీ ఆశలు నెరవేరడానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?