CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ తర్వాత జిల్లాల పర్యటన మొదలు కానున్నది. ఉమ్మడి జిల్లాల వారీగా షెడ్యూల్ తయారు చేయాలని ఇప్పటికే పార్టీకి చెప్పినట్లు తెలుస్తుంది. అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా ప్రణాళికను రూపొందించనున్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రతి జిల్లాలోని శాసన సభ్యులతో సీఎం భేటీ కానున్నారు. నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
ఇప్పటికే ప్రత్యేక రిపోర్టు తయారు చేయాలని సీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలిచ్చారు. జిల్లాల టూర్ సందర్భంగా ఏర్పాటు చేయబోయే రివ్యూలో సీఎం ఆ రిపోర్టును పరిశీలించి ఫండ్స్ ఇవ్వనున్నారు. డెవలప్ మెంట్ ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేయబోతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధిని తాను పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటానని ఇప్పటికే ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. దీంతో సీఎం జిల్లా టూర్లు ఉంటాయనే ప్రచారం వెలువడగానే, ఎమ్మెల్యేల్లో సంతోషం నెలకొన్నది.
నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఫండ్స్ రావడం లేదని కొందరి ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నది. దీన్ని గుర్తించిన సీఎం సీఎల్పీ మీటింగ్ లో క్లారిటీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, తన పర్యటనలో స్పాట్ లో నిధులు, జీవోలు రిలీజ్ అవుతాయని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అప్పులను చక్కదిద్దేందుకే ఏడాదిన్నర సమయం గడిచిపోయిందని, ఇప్పుడు ప్రభుత్వాన్ని గాడిన పెడుతున్నామని వివరణ ఇచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్యేలంతా సహకరించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు కచ్చితంగా పవర్ లో ఉంటుందని నొక్కి చెప్పారు.
Also read: Good News To farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం వీళ్లకి పండగే!
స్థానిక సంస్థల మైలేజ్…?
స్థానిక సంస్థల్లో మైలేజ్ ను తీసుకువచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ ఉంటుందనే అభిప్రాయం పార్టీలో నెలకొన్నది. ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తూ, నేరుగా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. పేద, నిరుపేద, కుటుంబాలను ప్రత్యేకంగా కలిసి కష్ట సుఖాలపై ఆరా తీయనున్నారు. సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. దీని వలన ప్రజల్లో పార్టీపై మరింత బలం చేకూరుతుందని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు చాలా నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లోపం నెలకొన్నది. వీటన్నింటినీ స్వయంగా సీఎం చక్కదిద్దనున్నారని టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు.