తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Kancha Gachibowli Land: కంచ గచ్చిబౌలి భూముల వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో సుప్రీంకోర్టులో జరిగే విచారణ సందర్భంగా బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులతో ఢిల్లీలో చర్చలు జరిగాయి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలో పలువురు అధికారులు సంప్రదింపులు జరిపారు.
భూముల వివాదానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాలు, విధించిన ఆంక్షలు, గత విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వీటన్నింటి నేపథ్యంలో ఈ నెల 16న జరిగే విచారణను దీటుగా ఎదుర్కొనేందుకు, వాదనల్లో ప్రస్తావించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.
చీఫ్ సెక్రటరీతో పాటు జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్, ప్రభుత్వ సలహాదారు కేఎస్ శ్రీనివాసరాజు తదితరులంతా లోతుగా చర్చించారు. ఓవైపు ఈ నెల 16న జరగనున్న విచారణతో పాటు చీఫ్ సెక్రటరీ సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్‌లో పొందుపర్చాల్సిన అంశాలపై కూడా సీనియర్ న్యాయవాదితో చర్చించినట్లు తెలిసింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది నుంచి సమాచారం లీక్ అవుతుందన్న ఉద్దేశంతో సీనియర్ న్యాయవాదితో జరిగిన భేటీ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
Also Read: Uppal Balu: అఘోరీగా మారబోతున్న ఉప్పల్ బాలు?