Vanajeevi Ramaiah: వనజీవి రామయ్య అందరికి సుపరిచితమే. ఈయన ప్రకృతికి చేసిన సేవ మరువలేనిది. ” చెట్లను పెంచండి ” అనే నినాదంతో పర్యావరణానికి విశేషమైన సేవ చేశారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రామయ్య ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు.
ఆ సభల్లో ఆయన మాట్లాడే మాటలు అందరి మనసులను తాకేవి. ఇప్పుడు, ఆయన మరణ వార్త విని చెట్టు కూడా కన్నీరు పెడుతుంది. అలాగే, పర్యావరణ ఉద్యమానికి ఇదొక తీరని లోటు అనే చెప్పుకోవాలి. ఆయన కలలు, మాటలు అన్ని ఆకుపచ్చగానే ఉండేవి. భూమి పచ్చగా ఉండాలని కోటికి పైగా మొక్కలను నాటారు.
వనం రామయ్య ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఈయనకు మొక్కలంటే అందుకే మొక్క కనిపించిందా? నీరు అందిస్తారు. అంతేకాదు తనను కలిసిన ఎవరికైనా మొక్కను అందించడం ఈయనకు అలవాటు. భావితరాలకు కాలుష్యం లేని పర్యావరణాన్ని అందించేందుకు అందరూ మొక్కలు నాటాలని ఊరూరా రామయ్య ప్రచారం సాగించారు.
అంతేకాదు అంతరించిపోతున్న అడవులకు ప్రాణం పోసేందుకు ఎన్నో గింజలు అడవిలో చల్లారు. వృక్షాలను మనం కాపాడితే .. అవి మనల్ని కాపాడతాయంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
అయితే, ఆరోగ్యం విషమించడంతో శనివారం తెల్లవారుజామున మరణించారు. 2017లో రామయ్యను పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ నేపథ్యంలోనే రామయ్య మృతి పట్ల పర్యావరణ ప్రేమికులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు ట్వీట్ చేశారు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఆ ఏరియాలకు కొత్తగా మెట్రో సేవలు!
దేశానికి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
” ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని, కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించి, పద్మశ్రీ అవార్డు గ్రహించిన దరిపల్లి రామయ్య గారి మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమై ఆరున్నర దశాబ్దాలుగా ఆయన హరిత యాత్రను రామయ్య కొనసాగించారని, అనారోగ్య సమస్యలు వేధించినా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదంటూ ఆయన సేవలను కొనియాడారు. రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అన్నారు. దార్శనికుడు రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం ” అంటూ పలువురు రాజకీయ ప్రముఖులు ట్వీట్ చేశారు.