– కేసీఆర్ పాలనలో అటవీ భూముల విధ్వంసం
– రిజర్వ్ ఫారెస్ట్‌లో కబ్జాకు పాల్పడిన డెక్కన్ సిమెంట్
– ఆనాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ముడుపులు
– నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు
– హెచ్‌సీయూ వివాదం నేపథ్యంలో తెరపైకి పాత వ్యవహారం
స్వేచ్ఛ, ఇన్వెస్టిగేషన్ టీం:
Deccan Cement Land: హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో స్కాం అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో అటవీ భూమి ఎంతలా విధ్వంసానికి గురైందన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే డెక్కన్ సిమెంట్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో అటవీ భూమిని, అటవీ శాఖను ఇష్టానుసారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని పర్యావరణ వేత్తలు గుర్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని డెక్కన్ సిమెంట్ కంపెనీ ఏర్పాటే అందుకు చక్కటి ఉదాహరణగా చెబుతున్నారు. వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న సున్నపు రాయి మైనింగ్ కార్యకలాపాల విషయంలో ఎలాంటి నియమాలు పాటించారన్నది హాట్ టాపిక్ అయింది.
చట్టాలకు విరుద్ధంగా..
అక్రమంగా ఆక్రమించిన అటవీ భూమిని తిరిగి ఆ ఆక్రమణదారునికే చెందేలా చెయ్యమని దేశంలో ఏ చట్టంలో కూడా లేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. వెంటనే, ఈ ఆక్రమణలపై తీవ్రమైన చర్యలు తీసుకోవడమే కాకుండా తక్షణమే ఆ భూమిని విడిపించి అటవీ భూమిగా కొనసాగించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. అడవులను, పర్యావరణాన్ని, భూగర్భ ఖనిజాలను ఎలా సంరక్షించుకోవాలో, ఎలా వినియోగించుకోవాలో సక్రమంగా లేకపోతే, రాబోయే తరాలకు జరగబోయే నష్టం ఏ విధంగా ఉంటుందో సుప్రీంకోర్టు హెచ్చరించిందని వివరిస్తున్నారు. ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్ట్ ప్రకారం, 1980 సంవత్సరం తరువాత జరిగిన అడవుల ఆక్రమణలను అన్నింటినీ తొలగించాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ముందస్తు అనుమతులు లేకుండా అటవీ భూములలో అటవీయేతర కార్యకలాపాలు చేయకూడదు. అలా చేస్తే సంబంధిత అటవీ అధికారులు తక్షణమే స్పందించి ఆ ఆక్రమణలను తొలగించాలి. అలాగే, 1980 అటవీ సంరక్షణ చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిగిన ఎటువంటి ఆక్రమణను క్రమబద్ధీకరణ సైతం చేయకూడదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఇవన్నీ సక్రమంగా అమలవుతున్నాయా అంటే కచ్చితంగా లేదు. నిరు పేదలు, చిన్న సన్నకారు రైతులు, గిరిజనులు, బలహీన వర్గాల వారి విషయంలో మాత్రం అమలు చేస్తున్న పరిస్థితి. కార్పొరేట్ శక్తులపై, వారి కంపెనీలపై ఈ చట్టాలు, నియమాలు, కోర్టుల తీర్పులు ఏమీ పని చేయడం లేదు. డెక్కన్ సిమెంట్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం.
అంతా అక్రమమే..
డెక్కన్ సిమెంట్ కంపెనీ తన ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న సైదుల్‌నామ రిజర్వ్‌డ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించింది. సుమారు 32 హెక్టార్ల భూమిని 2011 నుండి 2016 మధ్యకాలంలో ఆక్రమించి, అనేక కట్టడాలను నిర్మించింది. ఇదంతా విచారణలో బయటపడింది. కానీ, ఆక్రమణ జరుగుతున్నప్పుడు ఏ అటవీ సంరక్షణ అధికారి దీనిని గుర్తించలేదు. పైగా, తెలిసిన తరువాత సైతం అన్ని రకాల అటవీ చట్టాలకు, నియమాలకు, ఉత్తర్వులకు, తీర్పులకు విరుద్ధంగా ఆ భూమిని డెక్కన్ సిమెంట్‌కే కేటాయించారు. ఇప్పుడు హెచ్‌సీయూ భూములని చెబుతున్నది ప్రభుత్వ ల్యాండ్ అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అక్కడ మొలిచిన ముళ్ల కంచెలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా, బీఆర్ఎస్ నేతలు నానా రాద్ధాంతం చేశారని, డెక్కన్ సిమెంట్ వ్యవహారంపై ఏం సమాధానం చెబుతారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఇష్టారీతిన అటవీ భూమిని ఆక్రమిస్తే, అప్పుడు ఏమైపోయాయి ఈ అటవీ సంరక్షణ చట్టాలు? అప్పుడు ఎక్కడున్నారు ఈ అటవీ సంరక్షకులు అని ప్రశ్నిస్తున్నారు. పైగా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగమే ఆక్రమణ దారుల కోసం పెద్ద పోరాటమే చేశారని గుర్తు చేస్తున్నారు. కంపెనీ నుండి వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ పెద్దలు, అధికారులకు అంది ఉంటాయని దీనిపై విచారణ జరిపితే నిజానిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.