Telangana Earthquake: ఒకప్పుడు అడపా దడపా వినిపించే భూకంప వార్తలు.. ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. ప్రపంచంలో ఏదోక మూల తరచూ భూమి కంపిస్తూనే ఉంది. అందులో కొన్ని పెను విపత్తులకు దారి తీస్తే మరికొన్ని ప్రజలకు భయాందోళనకు గురి చేసి వదిలేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణకు ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ (Epic Earthquake Research & Analysis).. భూకంప హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ సంస్థ ఏం చెప్పిందంటే?
ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ సూచన ప్రకారం.. తెలంగాణలో ఏప్రిల్ 10-17 తేదీ మధ్య.. భూకంపం సంభవించే అవకాశముంది. అది కూడా రామగుండం సమీపంలో భూమి భారీగా కంపించవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. అంతేకాదు ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్ సహా ఏపీలోని అమరావతి వరకూ చేరే అవకాశముందని సదరు సంస్థ హెచ్చరించింది. అయితే ఆ సంస్థ చేసిన హెచ్చరికలో.. శాస్త్రీయత ఉందా అనేది ప్రస్తుతం చర్చకు తావిస్తోంది. ఇప్పటివరకూ దీనిని ఏ ప్రభుత్వ వర్గాలు, విపత్తు అధికారులు ధ్రువీకరించకపోవడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాలు సేఫేనా?
వాస్తవానికి భారత్ లో భూప్రకంపనలు స్వరసాధారణం. అయితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలోనే ఈ ముప్పు అధికం. దేశ రాజధాని ఢిల్లీ సహా.. ఉత్తరాదిలోని చాలా ప్రాంతాలు భూకంప పరిధి జోన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు దేశాలైనా పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ లో ఏ చిన్న భూకంపం వచ్చిన ఆ ప్రకంపనలు ఉత్తరాది రాష్ట్రానికి చేరుతుంటాయి. అయితే దక్షిణాదికి అలాంటి భయాలు ఏమి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏ జోన్ అంటే!
భూకంప తీవ్రతను బట్టి దేశంలోని ప్రాంతాలను ఐదు జోన్లుగా విపత్తు నిర్వహణ అధికారులు విభజించారు. ఐదో జోన్ లో చాలా సీరియస్ గా భూకంపం వచ్చే ఛాన్స్ ఉన్న ప్రాంతాలను చేర్చారు. జోన్ 5లోని జమ్ముకశ్మీర్, పశ్చిమ – మధ్య హిమాలయాలు.. ఉత్తర బీహార్, మధ్య బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భవిష్యత్ లో ఎప్పుడైనా 7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో వచ్చే ఛాన్స్ ఉంది. జోన్ – 4లో 6-7 తీవ్రతో భూకంపం వచ్చే అవకాశమున్న ప్రాంతాలను వేశారు. ఇక తెలుగు రాష్ట్రాలను జోన్ 3 కింద పెట్టారు. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతో వచ్చే భూకంపాలు మాత్రమే వచ్చే అవకాశముంది.
Also Read: AP Inter Results 2025: రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ మార్పులు గమనించారా.. లేకుంటే కష్టమే!
భయం లేనట్లే..
సాధారణంగా రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతో వచ్చే భూకంపాలు జనావాసాలపై పెద్దగా ప్రభావం చూపవని నిపుణులు సూచిస్తున్నారు. 6 లేదా ఆ పైనా తీవ్రతతో వచ్చే భూ ప్రకంపనల వల్ల తీవ్ర నష్టాలు సంభవిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కన చూస్తే తాజా భూకంప హెచ్చరిక వల్ల తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు. పైగా గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చినప్పటికీ ఎక్కడా 5 దాటి నమోదు కాలేదు. 1969 ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో 5.1 భూకంపం వచ్చింది. ఆ తర్వాత 1998లో అదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రతతో భూమి కంపించింది. హైదరాబాద్ లో 1984, 1999, 2013లో ప్రకంపనలు వచ్చాయి. అవి పెద్దగా ప్రభావం చూకపోవడం గమనార్హం.
అసత్య ప్రచారం..
మరోవైపు ఎపిక్ సంస్థ ఇచ్చిన భూకంప వార్నింగ్ ను నమ్మవద్దని NGRI ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్ స్పష్టం చేశారు. EPIC లాంటి సంస్థ NGRI కి అప్రోచ్ కాలేదు… అది సైంటిఫిక్ గా ప్రమాణికం కాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రామగుండం కేంద్రంగా భూకంపం వస్తుందనేది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వం.. NGRI గానీ.. జాతీయ స్థాయి రీసెర్చ్ సంస్థలు అప్రమత్తం చేస్తాయని పేర్కొన్నారు.