తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: MP Chamala Kiran Kumar: కేసీఆర్, హరీష్ రావుల మధ్య వన్ సైడ్ లవ్ నెలకొన్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎంకు హరీష్ అంటే లెక్కలేకపోయినా, హరీష్ మాత్రం కేసీఆర్ పై చాలా ప్రేమ చూపిస్తుంటారని ఆయన గుర్తు చేశారు.
ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో కుర్చీ పంచాయితీ నెలకొన్నదన్నారు. ప్రభుత్వంపై ఎవరు ఎక్కువ విమర్శలు చేస్తే, వాళ్లకు అత్యధిక మార్కులు ఇస్తానని కేసీఆర్ చెప్పినట్లు ఉన్నారని ఎంపీ గుర్తుచేశారు. అందుకే హరీష్, కేటీఆర్, కవితలు తమ సర్కార్ పై కంటిన్యూగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 7 లక్షల కోట్లు అప్పులు ఉన్నా, ఇచ్చిన హామీలను సమర్ధవంతంగా అమలు చేస్తున్న సర్కార్ కాంగ్రెస్ అని గుర్తు చేశారు.
200 యూనిట్లు కరెంట్, సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు రుణమాఫీ, ఆర్టీసీ ఉచిత బస్సు వంటి స్కీమ్ లను బీఆర్ ఎస్ గుర్తించడం లేదన్నారు. కళ్లుండి కూడా చూడలేని నేతలు విమర్శించడం సరికాదన్నారు. ఇక తమ పీసీసీ అధ్యక్షుడు బీసీ వ్యక్తి ఉన్నారని, బీఆర్ఎస్ లోనూ బీసీకి మంచి పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.