BRS Party silver jubilee: స్వేచ్ఛ పత్రిక ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. స్వేచ్ఛ ముందే చెప్పినట్టుగా రజతోత్సవ వేడుకల్లో హరీశ్‌రావును పక్కకు పెట్టేశారు. ఆయనను కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పకనే చెప్పారు. రజతోత్సవసభ నిర్వహణలో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌తో ఈ విషయం తేటతెల్లమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీశ్ రావుకు ప్రాధాన్యత తగ్గించేశారన్న చర్చ జరుగుతున్నది. హరీశ్ రావు రాజకీయంగా ఎదిగితే తన కుమారుడికి ఇబ్బంది అవుతుందేమోనని కేసీఆర్ భావించినట్టున్నారు. అందుకే రజతోత్సవ వేడుకుకు సంబంధించిన పోస్టర్‌లో హరీశ్ రావు ఫొటో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పోస్టర్‌ను చూసిన సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు హరీశ్ అభిమానులు మండిపడుతున్నారు.
స్వేచ్ఛ చెప్పిందే నిజమైంది
పాపం హరీశ్ కేటీఆర్ చేతుల్లోకే అంతా అంటూ స్వేచ్ఛ పత్రిక బుధవారం సంచికలో సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనంలో చెప్పినట్టుగానే తాజా పరిణామాలు జరిగాయి. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, బీఅర్ఎస్ శ్రేణులు వరంగల్‌లో జరిగే రజతోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో కేవలం కేసీఆర్ కేటీఆర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించిన హరీశ్ రావు ఫొటో ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
జీర్ణించుకోలేకపోతున్న క్యాడర్
పోస్టర్‌లో హరీశ్ ఫొటో లేకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పార్టీకి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమం జరిగినా హరీశ్ రావు ఫొటో ఉండేదని కానీ ఇప్పుడు ఎందుకు తొలగించారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఫొటో తీసేయడం ద్వారా హరీశ్ రావు కేవలం మెదక్ జిల్లా, సిద్దిపేట నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేస్తున్నట్టు హైకమాండ్ సంకేతాలు పంపించిందా? అన్న డిస్కషన్ సాగుతున్నది. తొలుత రజతోత్సవసభ బాధ్యతలు హరీశ్‌కు అప్పగించడం ఆ వెంటనే కేటీఆర్‌కు అప్పగించడం తెలిసిందే. కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌ను ప్రమోట్ చేసేందుకు ఇలా చేస్తున్నారన్న వాదనలు సగటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి.
ఎక్కడ చూసినా కేటీఆరే..
రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా సన్నాహక సమావేశంలో మినహా ఎక్కడా హరీశ్ రావు కనిపించలేదు. కేటీఆర్ అంతా తానై వ్యవహరించారు. కాగా పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్య భూమిక పోషించిన హరీశ్ రావును ఉద్దేశ్యపూర్వకంగానే పక్కకు పెడుతున్నారన్న చర్చ జరుగుతున్నది. 2001లో పార్టీ ఆవిర్భావం అనంతరం హరీశ్ రావు కీలక నేతగా కొనసాగారు. కేటీఆర్ ఎంట్రీ తర్వాత క్రమంగా హరీశ్ రావుకు ప్రాధాన్యత తగ్గింది. తెలంగాణ ఉద్యమంలో హరీశ్ రావు పాత్ర మరువలేనిదని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అక్కన్నపేట రైల్వే ఉద్యమం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
Also Read: Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!
ఉద్యోగులు,ఉపాధ్యాయులు,జర్నలిస్టులు,కుల సంఘాలు,జేఏసీ నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో హరీశ్ కీలక పాత్ర పోషించారని కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీలోని కిందిస్థాయి నేతలను సైతం హరీశ్ పేరు పెట్టి పిలవగలరు. అటువంటి నేతను ఎందుకు దూరం పెడుతున్నారన్న చర్చ జరుగుతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీలో అంతర్గత కలహాలు వచ్చే అవకాశం ఉందని క్యాడర్ చర్చించుకుంటున్నది.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/