Drugs Seized India: అధికార యంత్రాంగాలు పకడ్భంధీ చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ మహమ్మారికి పూర్తి స్థాయిలో చెక్ పడటం లేదు. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న గ్యాంగులు మాదక ద్రవ్యాల దందాను కొనసాగిస్తూనే ఉన్నాయి. బంగారు భవిష్యత్తు ఉన్న యువతను మత్తులోకి నెడుతూనే ఉన్నాయి. అధికారవర్గాలు చెబుతున్న ప్రకారం సింహ భాగం డ్రగ్స్ సముద్ర మార్గాల ద్వారా మన దేశంలోకి చేరుతున్నాయి. ఆ తరువాత పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాలతో ఉన్న సరిహద్దుల వద్ద డ్రగ్ మాఫియా గ్యాంగులు, కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏటా వేల కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను డ్రోన్ల ద్వారా మన దేశంలోకి పంపిస్తున్నాయి.
రూ.11,311 కోట్ల డ్రగ్స్ పట్టివేత
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గడిచిన అయిదేళ్లలో రూ. 11,311 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ వేర్వేరు ప్రాంతాల్లోని ఓడ రేవుల్లో దొరికినట్టు లోక్ సభ (Loksabha) సాక్షిగా చెప్పటం పరిస్థితికి దర్పణం పడుతోంది. ప్రతీ ఏటా 10వేల కిలోలకు పైగా హెరాయిన్ (Heroin), కొకైన్ (Cocaine) ఇతర మాదక ద్రవ్యాలు దేశ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా మన దేశంలోకి చేరుతున్నాయి.
ఆ దేశాల నుంచి డ్రగ్స్
నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (Narcotic Control Bureau Reports) నివేదికల ప్రకారం మన దేశంలోకి సముద్ర మార్గాల ద్వారానే అధిక మెుత్తంలో డ్రగ్స్ వచ్చి చేరుతున్నాయి. అది కూడా హిందూ మహా సముద్రం (Indian Ocean), అరేబియా సముద్ర తీరాల్లోని (Arabian Ocean) పోర్టులకు ఎక్కువగా మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. ఆఫ్రికన్ దేశాలతో పాటు సౌత్ అమెరికా నుంచి సముద్ర మార్గాల ద్వారా కొకైన్, హెరాయిన్, ఓపీఎం (Opium), ఎండీఎంఏ (MDMA), హషీష్ (Hashim), కుష్ (Kush), గంజాయి (Ganza) తదితర డ్రగ్స్ భారత్ కు సరఫరా అవుతున్నాయి. ముంబయి, ముండ్రా, కాండియా, నవ్ షేవా, కొచ్చి, పాండిచ్చేరి, కోల్ కతా, చెన్నై (Chennai), వైజాగ్ (Vizag) తదితర పోర్టులకు వాటిని తరలిస్తున్నారు.
ఎలా సరఫరా చేస్తున్నారంటే?
అయితే ఈ డ్రగ్స్ ను ఆయా దేశాల డ్రగ్ డీలర్స్ చాలా తెలివిగా భారత్ కు పంపిస్తున్నారు. దుస్తులు, చిన్న పిల్లల ఆట సామాగ్రి, కాస్మెటిక్స్ ఇలా రకరకాల వస్తువుల బాక్సుల ద్వారా వీటిని చేరవేస్తున్నారు. ఎవరికీ పట్టుబడకుండా ఉండటానికి 10-20 గ్రాముల చొప్పున ప్యాకెట్లలో పెట్టి ఇక్కడికి తరలిస్తున్నారు. అయితే భారత్ కంటే ముందు అప్ఘనిస్తాన్ (Afghanisthan), ఇరాన్ (Iran), శ్రీలంక (Srilanka), మాల్దీవుల (Maldives) దేశాల్లోని పోర్టులకు మొదట ఈ మాదక ద్రవ్యాలను స్మగ్లర్లు చేరుస్తున్నారు.
చిన్న చిన్న బోట్లతో…
అలా ఆఫ్రికన్, సౌత్ అమెరికా దేశాల నుంచి వచ్చిన డ్రగ్స్ ను చిన్న చిన్న బోట్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల పోర్టులకు తరలిస్తున్నారు. ఆయా పోర్టుల్లో ఎప్పుడు డ్రగ్స్ దొరికినా వాటి విలువ వేల కోట్లలో ఉంటోందని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం శ్రీలంక నుంచి వచ్చిన రెండు బోట్ల నుంచి 300, 337 కిలోల హెరాయిన్ ను సముద్ర గస్తీ దళాలు స్వాధీనం చేసుకోవటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
గుజరాత్ లో అత్యధికం
డ్రగ్స్ పై కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మార్చి 18న పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. షా మాటల ప్రకారం గడిచిన అయిదేళ్లలో దేశంలోని వేర్వేరు పోర్టుల్లో రూ.11,311 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రధాని మోదీ (PM Modi) సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) లోనే దీనికి సంబంధించి 8 కేసులు నమోదు కావటం గమనార్హం. వీటిలో 3 కేసులు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్న అదానీ (Gautam Adani) ఆధ్వర్యంలో నడుస్తున్న ముండ్రా పోర్టు (Mundra Port)లోనే రిజిష్టర్ కావడం ఆసక్తికరం.
సరిహద్దుల నుంచి..
సముద్ర మార్గాల తరువాత మాదక ద్రవ్యాలు ఎక్కువగా సరిహద్దుల నుంచి దేశంలోకి వస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఈ కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మన దేశంలోని పంజాబ్ (Punjab), పశ్చిమ బెంగాల్ (West bengal), జమ్మూ కాశ్మీర్ భారత్–పాక్ సరిహద్దుల్లో ఉన్నాయి. బోర్డర్ లో కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో నిఘా పెట్టే పరిస్థితి లేదు. దీనిని అవకాశంగా చేసుకుంటున్న డ్రగ్ డీలర్లు ఆయా ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను మన దేశంలోకి చేరుస్తున్నారు. ఈ గ్యాంగులకు తోడుగా దేశం అవతలి వైపు ఉన్న ఉగ్రవాద సంస్థలు డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ ను మన దేశం లోపలికి చేరవేస్తున్నారు.
Read Also: Tirupati Pakala Katpadi: ఏపీకి గుడ్ న్యూస్.. ఆ రూట్ లో రైళ్లు రయ్.. రయ్..
ఏజెంట్ల సాయంతో..
సరిహద్దుల్లోని గ్రామాల్లో ఉంటున్న డ్రగ్ డీలర్ల ఏజెంట్లు ఇలా వచ్చి పడుతున్న మాదక ద్రవ్యాలను దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రతీ యేటా కనీసం 10వేల కిలోలకు పైగా హెరాయిన్, ఇతర డ్రగ్స్ ఇలా డ్రోన్ల ద్వారా మన దేశంలోకి చేరుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలా వచ్చిన డ్రగ్స్ ను స్థానిక గ్యాంగులు వేర్వేరు మెట్రో సిటీల్లో విక్రయిస్తున్నాయి. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు పార్సిళ్ల రూపంలో కొరియర్ల ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఆయా సిటీల్లో ఉండే వీరి పెడ్లర్లు ఈ డ్రగ్స్ ను సినీ రంగానికి చెందిన వారితోపాటు బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల పిల్లలు, విద్యార్ఙినీ, విద్యార్థులకు విక్రయిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఆఫ్రికన్ పెడ్లర్లే ఉంటుండటం గమనార్హం.
డెడ్ డ్రాప్ ద్వారా…
కస్టమర్లకు డ్రగ్స్ ఇస్తున్నపుడు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు లోకల్ గ్యాంగులు డెడ్ డ్రాప్ టెక్నిక్ ను అనుసరిస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా డబ్బులు తెప్పించుకుంటున్న పెడ్లర్లు.. ఆ తర్వాత డ్రగ్స్ ను ప్యాకెట్లలో పెట్టి నిర్జన ప్రాంతాల్లో వదిలి పెడుతున్నారు. ప్యాకెట్ ఫోటో తీసి లొకేషన్ ను తమకు డబ్బు చెల్లించిన వారికి షేర్ చేస్తున్నారు. ఆ తరువాత డబ్బు ఇచ్చిన వారు లొకేషన్ కు వచ్చి మాదక ద్రవ్యాలను తీసుకెళ్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ఈ డ్రగ్ పెడ్లర్లు కమీషన్ల ఆశ చూపించి స్థానికుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు జమ చేయిస్తుండటం గమనార్హం. ఆ తర్వాత మనీ ట్రాన్స్ ఫర్ సంస్థలు, హవాలా వ్యాపారుల ద్వారా దానిని దేశ సరిహద్దులు దాటిస్తున్నారు.