Devadula Project: దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి దేవాదుల ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ ప్రక్రియ, పెండింగ్ పనుల పురోగతి, సాగు నీటి సరఫరాపై నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదన్నారు. దేవాదుల ప్రాజెక్టు తో స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగుకు నీరు అందుతోందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో అనేక పెండింగ్ పనులు ఉన్నాయని అన్నారు. మల్లన్న గండి లిఫ్ట్ -1, లిఫ్ట్-2 పనులను జులై లోగా పూర్తిచేసి సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోగా అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాలువ పనులు పూర్తి చేయాలన్నారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛా ఎఫెక్ట్.. అక్రమ విత్తన దందాపై అధికారుల ఉక్కుపాదం!
ఆర్ఎస్ ఘనపూర్ నుంచి నవాబ్ పేట ప్రధాన కాలువకు సీసీ లైనింగ్ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అన్ని డిస్ట్రిబ్యూటరీస్ లలో, మైనర్ కెనాల్స్ లలో గుర్రపుడెక్క, చెత్త చెదారాలను, చెట్లను, మొక్కలను తొలగించాలని సూచించారు. అవసరం ఉన్న దగ్గర రెగ్యులేటర్స్, షెటర్స్ ఏర్పాటు చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
నీటి నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, స్టేషన్ ఘనాపూర్ మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుజోడు రాంబాబు, దేవాదుల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, ఎస్డీసీలు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, నీటి పారుదల శాఖ ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ఘనపూర్ నియోజకవర్గ ఏజెన్సీ సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు