BJP MP Etela Rajender: తెలంగాణ అధ్యక్షుడి నియామకంపై గత కొన్నిరోజులుగా బీజేపీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బీజేపీ (Telangana BJP) పగ్గాలు ఎవరి చేపడతారా అన్న ఉత్కంఠ గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడ్ని బీజేపీ అధినాయకత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేత, మాల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ (Etela Rajender) ను కొత్త అధ్యక్షుడిగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రేపు (బుధవారం) సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
బీజేపీ ప్లాన్ అదేనా!
తెలంగాణలోని పవర్ ఫుల్ బీసీ నేతల్లో ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు సైతం బీసీల చుట్టే తిరుగుతోంది. బీసీల రిజర్వేషన్ (BC Reservations) అంటూ ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party).. ఢిల్లీలో మహా ధర్నా సైతం నిర్వహించింది. రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా ఆ వర్గానికి చెందిన నేతకు పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించినట్లు సమాచారం. ఈటెలకు అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయాలని కాషాయ అధినాయకత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వారిద్దరు బిజీ బిజీ..
తెలంగాణ బీజేపీకి కీలకంగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) వంటి ముఖ్య నేతలు.. ప్రస్తుతం కేంద్రమంత్రులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారు పార్టీకి సమయాన్ని కేటాయించలేకపోతున్నట్లు చర్చ జరుగుతోంది. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఒక విధమైన అయోమయం తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక బలమైన నేతకు అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం భావించింది. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి అధ్యక్ష రేసులో పలువురు పేర్లు సైతం వినిపించాయి. ఈ క్రమంలో ఈటెల పేరును ఖరారు చేసినట్లు నెట్టింట ప్రచారం జరగడం ఆసక్తికరంగా మారింది.
Also Read: New Liquor Brands: మార్కెట్ లోకి కొత్తగా 644 బ్రాండ్లు.. మందుబాబులూ.. మీరు సిద్ధమేనా!
కేసీఆర్ కు చెక్!
ఈటెలకు అధ్యక్ష పగ్గాలు ఇవ్వడం ద్వారా.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ (BRS) ను టార్గెట్ చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఈటెల రాజకీయం మెుత్తం గతంలో బీఆర్ఎస్ చుట్టూనే తిరిగింది. రాష్ట్ర అవతరణ అనంతరం ఆర్థిక, ఆరోగ్య మంత్రిగానూ ఈటెల పనిచేశారు. అయితే కేసీఆర్ (KCR)తో తలెత్తిన విభేదాల కారణంగా ఈటెల పార్టీని వీడి బయటకొచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీని వీడాక కేసీఆర్ పై ఈటెల తీవ్రస్థాయిలో విమర్శలు సైతం గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈటెలకు అధ్యక్ష పగ్గాలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కు సైతం చెక్ పెట్టవచ్చని కాషాయ దళం భావించి ఉండొచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.