Telangana Group 1: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష (Group 1 Exams)ల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) తీపి కబురు అందించింది. పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) జారీ చేసిన జీవో నెం.29 (G.O 29) రద్దు చేయడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు.
Also Read: Hyd Local Body Elections: హైదరాబాద్ లో ఎన్నికల హీట్.. సై అంటోన్న బీజేపీ-ఎంఐఎం.. గెలుపు ఆ పార్టీదేనా?
గ్రూప్స్ పరీక్షల్లో దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో నెం.29ను జారీ చేసింది. 2022లో జారీ చేసిన జీవో 55కు (G.O. 55) సవరణలు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 8న కొత్త జీవోను తీసుకొచ్చింది. అయితే దీనిని సవాలు చేస్తూ కొందరు గ్రూప్ – 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సదరు జీవోను రద్దు చేయాలని కోరారు. తాజాగా ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపశమనం లభించినట్లైంది. గ్రూప్ – 1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ జాబీతాను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో త్వరలో సర్టిఫికెట్స్ పరిశీలన జరగనుంది.