Khammam farmers: గత డెబ్బై సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న మా భూములను కాపాడాలని, జీళ్ళచెరువు గ్రామానికి చెందిన నిరుపేద దళిత, బీసీ రైతులు రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. తమ భూములలో రెవెన్యూ అధికారులు అకస్మాత్తుగా సర్వే చేయడం తట్టుకోలేని రైతులు గురువారం మంత్రి కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ధర్మతండాకు రావడంతో వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో సుమారు 40మంది రైతులు మంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకున్నారు. జీళ్లచెరువులోని సర్వే నంబర్ 430లో సుమారు 40మంది రైతులు భూమి సాగు చేసుకుంటుంటే, గురువారం అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు భూమి సర్వే చేయడంతో ఆందోళనకు గురయ్యమని మంత్రికి వివరించారు. ఈ భూమిని గడిచిన 70ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నామని, దరణి వల్ల కొంతమందికి పాస్ పుస్తకాలు వచ్చాయి, కొంతమందికి రాలేదని మంత్రికి వివరించారు.
Aslo Read: CWC on Musi: మూసీకి ముప్పు.. కూడిపోతున్న జలాశయం.. హెచ్చరికలు జారీచేసిన సీ.డబ్ల్యు.సీ
మహిళా రైతులు మంత్రి ఎదుట కన్నీరు మున్నీరైయ్యారు. దీంతో స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి సమస్య పట్ల సానుకూలంగా స్పందించారు. తక్షణమే ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ కరుణశ్రీ ని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూసుమంచి మండలానికి వందపడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరైందని, దానిని నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం అప్పగించాలని సర్వే చేస్తున్నామని వారు చెప్పడంతో రైతులంతా విస్మయానికి గురైయ్యారు.
దీంతో పెండ్ర అంజయ్య మాట్లాడుతూ ఈ సర్వే నంబర్లో కుటుంబానికి ఒక ఎకరం, అర్థ ఎకరం భూమి జీవనాధారంగా మలుచుకుని జీవితం ఎల్లదీస్తుంటే ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. ఆ భూముల విషయంలో సర్వే ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతులు మంత్రికి వివరించారు. వినతి పరిశీలించిన మంత్రి వెంటనే ఆర్డీవో, తహసీల్దార్ కరుణ శ్రీని సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూసి రైతులకు అన్యాయం జరగవద్దని సూచించారు. అవసరం అయితే వేరే అవకాశం ఉంటే చూడాలని వారిని ఆదేశించారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య, కొండా శ్రీనివాస్ రావు, కాసాని వెంకన్న, నాగలక్ష్మి, దళిత రైతులు సుమారు 50మంది పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.comలింక్ క్లిక్ చేయగలరు