Mahesh Kumar Goud: బీసీల రిజర్వేషన్ల పెంపును పట్టుబడుతూ ఢిల్లీ బాట పట్టిన.. తెలంగాణ బీసీ నేతలు అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ చట్టం చేసిన ప్రభుత్వం తమదేనని గుర్తుచేశారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కులగణనన చేసినట్లు చెప్పారు. మరోవైపు భాజపా (BJP) మతం పేరుతో ఓట్లు అడుగుతున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా హెచ్ సీయూ (HCU) భూముల వివదాన్ని ప్రస్తావించిన ఆయన గత పాలకులు చంద్రబాబు, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
‘చంద్రబాబు అప్పన్నంగా ఇచ్చారు’
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ వేదికగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు (AP CM Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు ఈ భూములను అప్పన్నంగా ఐఎంజీ భారత్ కు కట్టబెట్టారని విమర్శించారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Raja Sekhar Reddy) ఆ భూముల కేటాయింపును రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడారని అన్నారు. మరోవైపు కేసీఆర్ (KCR) గురించి ప్రస్తావించిన టీపీసీసీ చీఫ్.. బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత ఆయనదేనని అన్నారు.
పగటి కలలు కంటున్నారు.
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని సీఎం కేసీఆర్ భ్రమ పడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అవన్నీ పగటి కలలేనని కొట్టిపారేశారు. రాష్ట్రంలోని భూములను దోచుకోవడంతో పాటు రూ.లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణను ముంచారని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై విచారణ జరగాల్సిన అవసరముందని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.
మంత్రివర్గ విస్తరణపై..
మరోవైపు మంత్రి వర్గ విస్తరణపై జరుగుతున్న జాప్యంపైనా టీపీసీస చీఫ్ మాట్లాడారు. అది ఏఐసీసీ (AICC) పరిధిలో ఉన్నట్లు చెప్పారు. కేబినేట్ విస్తరణలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన అన్నారు. మంత్రి విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న మహేష్ కుమార్ గౌడ్.. ప్రాంతాలు, కులాల వారీగా నేతలను కేబినేట్ లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
బండి సంజయ్ పై సెటైర్లు
బీసీ నేతల సమావేశంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ నేత బండి సంజయ్ (Bandi Sanjay) కు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేయాలని బండి అంటున్నారని.. ఆ మాట కేంద్రం చేత అధికారికంగా చెప్పించాలని సూచించారు. రిజర్వేషన్లు అమలు చేసే వెసులుబాటు తమకే ఉంటే ఎప్పుడే అమలు చేసేవాళ్లమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సోనియా, రాహుల్ తో భేటి
ఇదిలా ఉంటే తెలంగాణ బీసీ నేతలు.. తాజాగా పార్టీ అధినేతలైనా సోనియా గాంధీ (Sonia Gandhi) , రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని విడివిడిగా కలిశారు. తెలంగాణలో చేపట్టిన బీసీల కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వంటి విషయాలను వారికి వివరించారు. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు చేపట్టిన మహాదర్నా గురించి సైతం వివరించారు.