Adilabad news: కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో అనే పాట వినే ఉంటారు. కానీ ఈ దృశ్యాలను చూస్తే, కమ్మనైన కొడుకు పాట పాడాలని అనిపించక మానదు. ఔను ఓ తల్లికి నాలుగేళ్ల కొడుకు చేస్తున్న సేవలు చూసి ఔరా అనాల్సిందే. నేటి రోజుల్లో ఇలాంటి బిడ్డ, ఆ తల్లికి దొరకడం ఎంత చేసుకున్న పుణ్యమో కదా అంటున్నారు స్థానికులు. తనకు గోరుముద్దలు తినిపించాల్సిన తల్లికి, తనే గోరుముద్దలు తినిపిస్తూ.. ఆ చిన్నారి ఏకంగా తన తల్లికి అన్నీ తానై సేవలు చేస్తున్నాడు. అసలేం జరిగిందంటే..
తల్లికి క్షయవ్యాధి సోకింది. ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతోంది. అమ్మ ప్రేమ అంటే ఇంకా పూర్తిగా తెలియని ఆ బాలుడు, తన తల్లికి సేవలు చేస్తూ.. అమ్మా.. నేనున్నాను అంటూ అండగా నిలుస్తున్నాడు. తనను నవమాసాలు మోసి పెంచిన తన తల్లి రుణం బాల్యంలోనే సేవలు చేస్తూ తీర్చుకుంటున్నాడు. ఈ దృశ్యాలు చూసిన ప్రజలు, అమ్మ కోసం ఆ చిన్నారి పడుతున్న కష్టాన్ని చూసి కన్నీరు రాల్చుతున్నారు. ఈ దృశ్యాలు జగిత్యాల జిల్లా ప్రధాన అసుపత్రి వద్ద మనకు కనిపిస్తాయి.
అదిలాబాద్ జిల్లా పెద్దూర్ మండలం ఎలగడప కి చెంసిన రాజేందర్, జ్యోతి దంపతులు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. వీరికి ఓ కూతురు,కొడుకు ఉన్నారు. దురదృష్టవశాత్తు జ్యోతి కి క్షయవ్యాధి సోకి అనారోగ్యానికి గురి కాగా జగిత్యాల ప్రధాన అసుపత్రి లో చేర్పించారు.
ఆమె భర్త రాజేందర్ పనుల మీద బయటికి వెళ్ళడంతో, తన తల్లికి నాలుగేళ్ల కొడుకు సేవలు చేస్తున్నాడు. తన తల్లి బెడ్ వద్దే ఉంటూ.. కాళ్ళు ఒత్తుతూ సపర్యలు చేస్తున్నాడు. అంతే కాదు.. తన తల్లికి అమ్మా తినమ్మా అంటూ గోరుముద్దలు పెడుతూ భోజనం తినిపిస్తూ అమ్మ పట్ల తన ప్రేమను చాటుకుంటున్నాడు. తల్లిని కంటికి రెప్పలాగా కాపాడుతూ సేవలు చేస్తుండడంతో అ చిన్నారిని చూసి శభాష్ అని స్థానికులు మెచ్చుకుంటున్నారు.
Also Read: BC Dharna at Jantar Mantar: ఢిల్లీలో బీసీ పోరు.. గళమెత్తిన తెలంగాణ కాంగ్రెస్
అమ్మ ప్రేమ ఎంత పవిత్రమైనదో గ్రహించిన ఆ చిన్నారి, తన తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. మానవాతావాదులు కాస్త స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏదిఏమైనా ఆటలాడుకొనే వయస్సులో తన తల్లికి సపర్యలు చేయాలన్న ఆలోచన తట్టిన ఆ చిన్నారిని అభినందించాల్సిందే. అయితే తన కుమారుడు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి, ఆ తల్లి కన్నీరు కారుస్తూ.. దేవుడా.. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నా బిడ్డలకు గోరుముద్దలు తినిపించే శక్తినివ్వు అంటూ వేడుకుంటోంది.