Telangana Cabinet: మంత్రివర్గ విస్తరణ దాదాపు కొలిక్కి వచ్చిందనుకుంటున్న సమయంలో ఢిల్లీ వేదికగా ఊహకు అందని తీరులో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాదిగ సామాజికవర్గానికి మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీ పెద్దలను కోరారు. అవకాశం ఇవ్వాలంటూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సైతం విజ్ఞప్తి చేశారు. లంబాడా కమ్యూనిటీకి ప్రాధాన్యత కల్పించాలని గిరిజన సంఘాల తరఫున ప్రతినిధులు రాహుల్‌గాంధీని పార్లమెంటులో కలిసి కోరారు. వీటన్నింటికి తోడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యమే లేనందున ఈసారి ఈ రెండు జిల్లాలకు తప్పనిసరిగా ఒక్కొక్కరి చొప్పున అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ సహా ఐదుగురు ఎమ్మెల్యేలు ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లను కలిసి రిక్వెస్ట్ చేశారు.
Also Read: Minister Ponnam prabhakar: దేశంలోనే తెలంగాణ ఫస్ట్.. కోటిమందిని కోటీశ్వరులం చేస్తాం.. మంత్రి పొన్నం
ఒకటి రెండు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని, నలుగురు ప్రమాణ స్వీకారం చేసే అవకాశమున్నదని, ఇప్పటికే గవర్నర్‌తో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి సూచనప్రాయంగా కొన్ని తేదీలను ప్రస్తావించినట్లు వార్తలు వెలువడ్డాయి. పీసీసీ, ఏఐసీసీ నేతల మధ్య తుది విడత చర్చలు ముగిశాయని, పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని, ఇక ముహూర్తం ఫిక్స్ కావడమే మిగిలిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొన్న సమయంలో రాష్ట్రం నుంచి వివిధ జిల్లాలకు చెందిన, వివిధ సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టి వరుస విజ్ఞప్తులు చేస్తుండడంతో మళ్ళీ ఈ వ్యవహారం మొదటికొచ్చినట్లయిందనే చర్చలు ఊపందుకున్నాయి. మంత్రివర్గంలో చోటు ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదని, కానీ జిల్లాలు, కమ్యూనిటీలకు మాత్రం ప్రాతినిధ్యం ఉండాలన్నది వీరందరి వాదన.
రాష్ట్ర జనాభాలో దాదాపు 42% మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారని, గత ప్రభుత్వంలో ఈ రెండు జిల్లాలకు చెందిన ఆరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కిందని, ఈసారి ఒక్కరికి కూడా లేకపోవడం పార్టీలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని రాహుల్‌గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులకు ఈ రెండు జిల్లాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సంతకాలు చేసి సమర్పించిన మెమొరాండంలో ప్రస్తావించారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నందున ఈ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోతే అది పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని, వ్యూహాత్మకంగానే ఈ రెండు జిల్లాల్లో పార్టీ బలపడాలంటే మంత్రివర్గంలో కనీసంగా ఇద్దరికి చోటు ఇవ్వడం అవసరమనే అభిప్రాయాన్ని వారితో జరిగిన భేటీలో వ్యక్తం చేశారు.
Also Read: Smart Ration Cards AP: కొత్త రేషన్ కార్డులపై అదిరిపోయే అప్ డేట్.. ప్రభుత్వం ప్లాన్ మామూల్గా లేదుగా!
డీలిమిటషన్ జరిగితే ఈ రెండు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 44కు, లోక్‌సభ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని వివరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోడానికి ఈ రెండు జిల్లాలకు మంత్రివర్గంలోనే కాక వివిధ రూపాల్లో ప్రయారిటీ కల్పించడం తప్పనిసరి అవసరమని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో గత నాలుగైదు రోజులుగా రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల, సామాజికవర్గాల నేతల నుంచి వస్తున్న ప్రతిపాదనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆరుగురిలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొలిక్కి వచ్చిందనుకుంటున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో ఎంపిక ప్రక్రియ మరోసారి చర్చలకు దారితీసే అవకాశమున్నది.