Skill university In Dubbaka: సీఎం రేవంత్ రెడ్డిపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అడగగానే దుబ్బాక నియోజకవర్గానికి స్కిల్ యూనివర్సిటీ కేటాయించినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో దుబ్బాకకు సరైన నిధులు రాలేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడానికి తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండల పరిధిలోని హబ్షీపూర్ శివారులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, సమీకృత హాస్టల్ నిర్మాణం కోసం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి కొత్త ప్రభాకర్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దుబ్బాక అభివృద్ధి కోసం చర్చించినట్లు వెల్లడించారు. తన విజ్ఞప్తి మేరకు స్కిల్ యూనివర్సిటీ, సమీకృత హాస్టల్ నిర్మాణానికి సీఎం వెంటనే అనుమతి ఇచ్చారని, ఈ ప్రాజెక్టుల కోసం భూసేకరణకు సీఎం కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ అయినట్లు ఆయన తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ కోసం 25 ఎకరాలు, హాస్టల్ నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించినట్లు వివరించారు.
Also Read: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు గడువు పెంపు? గడువు పెంచనున్న ప్రభుత్వం…
దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం అమూల్యమని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నెత్తిమీద మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ, కాలువల నిర్మాణం లేకపోవడంతో స్థానిక గ్రామాలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా గ్రామాలు మునిగిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుంచి ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు సాగునీరు, తాగునీరు వెళుతున్నా, స్థానిక చెరువులు, కుంటలకు నీరు అందడం లేదని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారం కోసం సీఎంతో చర్చించినట్లు ఆయన తెలిపారు. త్వరలో అధికారులతో సమీక్ష జరిపి కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
దుబ్బాక నియోజకవర్గం ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేట, మెదక్ నియోజకవర్గాల్లో మూడు ముక్కలుగా విభజించబడి ఉందని, రెవెన్యూ డివిజన్, ఏసీపీ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ల కోసం మూడు వైపులా వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను సరిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే, గతంలో పీఆర్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ.200 కోట్లు కేటాయించాలని సీఎంను కోరగా, త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ లభించినట్లు తెలిపారు. ఇప్పటికే హెచ్ఎఎం నిధుల ద్వారా రూ.35 కోట్లతో హబ్షీపూర్-లచ్చపేట డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
Also Read: హైదరాబాద్ స్థానికంపై బిజెపి డైలమా? అసలేం జరుగుతోంది?
దుబ్బాకకు రింగ్ రోడ్డు, రెవెన్యూ డివిజన్, ఏసీపీ కార్యాలయం వంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ శైర్ల కైలాసం, తాజా మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.