తెలంగాణ బ్యూరో, స్చేచ్ఛ: LRS Scheme: అనధికార లే అవుట్లలోని ప్లాట్లకు చట్టబద్దత కల్పించే ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు సర్కారు గడువును పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. రాయితీని మినహాయించి గడువు పెంచే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నిధుల సమీకరణ కోసం ఎల్ఆర్ఎస్ -2020 స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 25.86 వేల పై చిలుకు లే అవుట్ లెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తులు రాగా, వీటి క్లియరెన్స్ కు న్యాయపరంగా చిక్కులుండగా, పరిష్కారానికి దరఖాస్తులను సిద్దం చేసుకోవాలని న్యాయస్థానం సర్కారుకు సూచించిన నేపథ్యంలో మొత్తం 25 లక్షల పై చిలుకు దరఖాస్తులను క్లియర్ చేసుకుని రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సర్కారు సిద్దమైంది. ఇప్పటికే తొలి విడత ఎల్ఆర్ఎస్ ఛార్జీలను చెల్లించిన దరఖాస్తు దారులు మలి విడత రెగ్యులరైజేషన్ ఛార్జీలను ఈ నెలాఖరుకల్లా చెల్లిస్తే చెల్లించాల్సిన మొత్తం ఛార్జీల్లో 25 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు సర్కారు ప్రకటించినా, సర్కారు మంత్రం ఫలించలేదు.
Also read: BJP party: హైదరాబాద్ స్థానికంపై బిజెపి డైలమా? అసలేం జరుగుతోంది?
సర్కారు ఊహించినంత స్థాయిలో దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. మొత్తం 25 లక్షల పై చిలుకు దరఖాస్తుల్లో ఇప్పటి వరకు కేవలం 5 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ముందుకొచ్చి మలి విడత రెగ్యులరైజేషన్ ఛార్జీలను రూ.980 కోట్లను చెల్లించినట్లు సమాచారం. సర్కారు అంచనా వేసిన రూ.10 వేల కోట్లలో మొత్తం దరఖాస్తుదారులకు రాయితీనిచ్చినా సర్కారుకు రూ.7500 కోట్ల సమకూరుతాయని భావించిన సర్కారు అంచనాలన్నీ తారుమారయ్యాయి.
సర్కారు లెక్కలేసిన ఆదాయం రూ.10 వేల కోట్లలో కేవలం రూ.980 కోట్లు అంటే కనీసం పది శాతం కూడా ఆదాయం సమకూరకముందే, సర్కారు రాయితీతో విధించిన డెడ్ లైన్ సోమవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల 67 వేల 107 దరఖాస్తులను స్వీకరించగా, 20 లక్షల 493 మంది దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ లెటర్లను జనరేట్ చేసినట్లు,ఈ నెల 28 వరకు 3 లక్షల 25 వేల 538 మంది దరఖాస్తుదారులు మలి విడత క్రమబద్దీకరణ ఛార్జీలు చెల్లించగా, రాయితీకి చివరి రోజైన 31 వరకు రెండో విడత ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుల సంఖ్య 5 లక్షలకు చేరినట్లు సమాచారం. దీంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ కు సర్కారు గడువు పెంచాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ రాయితీని తొలగించి, గడువు పెంచాలని సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో సమావేశం కూడా జరిగినట్లు, నిర్ణయం త్వరలోనే ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also read: Cyber Criminal Arrested: సైబర్ నేరగాళ్లతో దోస్తీ.. ఎట్టకేలకు కటకటాల్లోకి..
ఎల్ఆర్ఎస్ తో జీహెచ్ఎంసీకి రూ.103 కోట్ల ఆదాయం
రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు రూ.980 కోట్లు చెల్లించగా,ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే 7881 మంది దరఖాస్తుదారులు సుమారు రూ. 103 కోట్ల 46 లక్షలను చెల్లించినట్లు సమాచారం. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ దరఖాస్తుల మలి దశ ఫీజులతో జీహెచ్ఎంసీకి రూ.103.46 కోట్ల ఆదాయం సమకూరింది. జీహెచ్ఎంసీలో మొత్తం లక్షా 7వేల 872 దరఖాస్తులను స్వీకరించింది.
ఎల్ఆర్ఎస్ కు సర్కారు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్ లలో జోన్ కు ఒకటి చొప్పున హెల్త్ డెస్క్ లను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు 59 వేల 564 మంది దరఖాస్తుదారులకు ఇంటిమెటెడ్ లెటర్లను జనరేట్ చేయగా, వీరిలో శనివారం సాయంత్రం వరకు దాదాపు 7881 మంది దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ మలి విడత ఛార్జీలుగా చెల్లించగా, మరో 99 వేల 991 దరఖాస్తులు మలి విడత ఫీజులు చెల్లించాల్సి ఉంది. దీంతో జీహెచ్ఎంసీకి రూ. మరో 900 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు లెక్కలేస్తున్నారు.
రాయితీ గడువు ముగిసే రోజు వరకు 5 లక్షల మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు సర్కారుకు రూ.980 కోట్ల ఫీజులు చెల్లించగా, అందులో జీహెచ్ఎంసీకి వచ్చిన రూ.103.46 మినహాయించగా, హెచ్ఎండీఏ ఇతర స్థానిక సంస్థల నుంచి సర్కారుకు రూ. 877 కోట్లు పై చిలుకు ఆదాయం సమకూరగా, అందులో సంహాభాగం హెచ్ఎండీఏ ఖజానాకు చేరింది.