Andhrula Annapurna Dokka Seethamma: డొక్కా సీతమ్మ.. ఈ పేరు ఇంతకు ముందు ఎవరికీ తెలియదేమో కానీ.. ఇప్పుడు మాత్రం చాలా మందికి తెలుసు. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డొక్కా సీతమ్మ అంటే బ్రిటీష్ వారికి కూడా తెలుసు. లండన్ రాజు ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఇక్కడే ఉండి అందరికీ సేవ చేసిన ఘనత ఆమె సొంతం. ఆమె కీర్తి ప్రతిష్టలు పవన్ కళ్యాణ్ చెబితేకానీ అందరికీ తెలియలేదు. ప్రస్తుతం ఏపీలో ఆమె పేరును అన్నదాన పథకానికి ప్రభుత్వం పెట్టడం అభినందనీయం. అసలు డొక్కా సీతమ్మ ఎవరు? ఆమె జనం కోసం ఏమి చేసింది? ఎందుకు ఆమెను ఆంధ్రుల అన్నపూర్ణమ్మ అని పిలుస్తారనే విషయాలను, వివరాలను తెలిపేందుకు ఇప్పుడో మెగాభిమాని కంకణం కట్టుకున్నాడు. అవును.. డొక్కా సీతమ్మ పేరుతో ఇప్పుడో సినిమా తెరకెక్కబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Rakul Preet Singh: బ్రేకప్ ఎంతో భయంకరం.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రలలో నటిస్తూ.. ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మాతగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేస్తుండగా.. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందిస్తున్నారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని. ఆయనను అభిమానిస్తూ.. 2012లో ఇండస్ట్రీలోకి వచ్చాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల అభిమానిగా ఒక మంచి పని చేయాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉండేది. ఈ క్రమంలో డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఒక అభిమానిగా ఆ సినిమాను తీసి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు అంకితం చేద్దాం అనుకున్నాను. డొక్కా సీతమ్మ చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను స్టార్ట్ చేశాం. డబ్బు కోసం మేము ఈ సినిమాను మొదలుపెట్టలేదు. కేవలం చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఓ మహనీయురాలి చరిత్రను తెలుగువాళ్లు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా మొదలుపెట్టాం. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మా ప్రొడ్యూసర్, మా టీమ్ అంతా కలిసి విరాళంగా ఇస్తాం. డొక్కా సీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఆ డబ్బులు విరాళంగా ఇస్తాం. నా మొదటి సినిమానే డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలి కథతో చేస్తుండటం నా అదృష్టం. త్వరలోనే ట్రైలర్‌తో వస్తామని అన్నారు.
Also Read- Chiranjeevi: నటించలేదు.. జీవించేశావ్.. మంగపతి పాత్రకి మెగా ప్రశంస!
మురళీ మోహన్ మాట్లాడుతూ.. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలి కథతో సినిమాను చేస్తున్నాం. ఆమె అప్పట్లో వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. అలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. డైరెక్టర్ రవి చాలా రీసెర్చ్ చేసి ఈ కథను రెడీ చేశాడు. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్‌కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమనికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి. అందరూ ఈ సినిమాను చూడాలని తెలపగా, ఆమని మాట్లాడుతూ.. దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథను చెప్పారు. నేను బెంగళూర్‌కు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి పెద్దగా తెలీదు. దర్శకుడు కథ చెప్పిన తర్వాత గూగుల్‌లో ఆమె గురించి వెతికాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకు అప్పుడు అర్థమైంది. ఇలాంటి పాత్రలను చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇలాంటి పాత్ర నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. మంచి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని చేస్తున్నామని అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు