Cm Revanth Reddy: ఉగాది వేడుకలను హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి తోపాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతను పండితులు తెలియజేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
షడ్రుచుల బడ్జెట్
ఈ ఉగాది.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాక్షించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి ప్రస్తావించిన రేవంత్.. అది షడ్రుచుల సమ్మేళనంగా ఉందని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నిటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు గుర్తుచే శారు.
దేశానికి ఆదర్శం కావాలి
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ అంటూ … దేశంలో ఒక వెలుగు వెలగాలని సూచించారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలన్న సీఎం.. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ (Futur City) నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు.
Also Read: Doctors Deliver Baby: నడిరోడ్డుపై యువతికి ప్రశవం.. డాక్టర్లపై నెటిజన్ల ప్రశంసలు.. ఎందుకంటే?
ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్
ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తో దేశంలోని పేదల ఆకలి తీర్చే పథకానికి గతంలో కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుభాగంలో నిలిచిందన్న రేవంత్.. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నట్లు చెప్పారు. పేదల ఆదాయం పెంచాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతామని అన్నారు.
భట్టిపై ప్రశంసలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినా సీఎం రేవంత్.. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ బేషుగ్గా ఉందని అన్నారు. తామిద్దరం జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తామిద్దరం ప్రయత్నిస్తామని రేవంత్ అన్నారు. ‘మా మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదం లాగా షడ్రుచులతో ఉంది. తీపి, పులుపు , కారం, ఉప్పు సమపాళ్లుగా బడ్జెట్ రూపొందింది’ అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.