తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Revenue Department: రాష్ట్రవ్యాప్తంగా 10,954 మంది గ్రామ పాలనాధికారుల (జీపీవో)ను నియమించడానికి కసరత్తు వేగవంతమైంది. వారం రోజుల క్రితం ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా ఇప్పుడు అర్హులైనవారిని నియమించేందుకు రెవెన్యూ శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. గతంలో వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)లుగా, వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)లుగా పనిచేసినవారిని ఈ పోస్టుల్లో నియమించనున్నది.
ఇంటర్‌మీడియట్ చదివి ఐదేండ్ల పాటు గతంలో వీఆర్వోలుగా, వీఆర్ఏలుగా పనిచేసినవారికి లేదా డిగ్రీ పాసైనవారికి అర్హత ఉంటుందని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏగా పనిచేసి ప్రస్తుతం రెగ్యులరైజ్ అయ్యి ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర పోస్టుల్లో పనిచేస్తున్నవారి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయించింది.
నియామక ప్రక్రియ పూర్తిగా సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్) పర్యవేక్షణలో జరుగుతున్నా జిల్లా కలెక్టర్లు చేపట్టనున్నారు. గ్రామ పాలనలో భాగంగా వారు నిర్వర్తించాల్సిన విధులపై కూడా మార్గదర్శకాల్లో నవీన్ మిట్టల్ క్లారిటీ ఇచ్చారు. గ్రామ లెక్కలను పకడ్బందీగా నిర్వహించడం, వివిధ రకాల ధృవీకరణ పత్రాలను జారీ చేసే ముందు తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపడం చేస్తారు.
Also Read: Telangana Govt: త్వరలో భారీ బదిలీలు.. ఆ 60 మంది అధికారులు?
చెరువులు, కుంటలు, నీటి తావుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, భూవివాదాలపై దర్యాప్తు జరిపి సర్వేయర్లకు సహకరించడం, విపత్తుల సమయాల్లో అత్యవసర సేవల్లో పాల్గొనడం.. ఇలాంటివన్నీ నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న లబ్ధిదారుల్ని గుర్తించడం, ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో పాటు ప్రొటోకాల్ డ్యూటీల్లో పాలుపంచుకోవడం, గ్రామంతో పాటు క్లస్టర్, మండల స్థాయిలో వివిధ విభాగాల మధ్య సమన్వయ బాధ్యతలు నిర్వర్తించడం, ఇవి కాక తాసీల్దార్ మొదలు కలెక్టర్, సీసీఎల్ఏ వరకు అప్పజెప్పిన బాధ్యతలను చూడడం
ఇవి కూడా వారి విధుల్లో ఉండేవని వివరించారు. గ్రామ పాలనాధికారి పోస్టుకు అర్హత కలిగినవారిని గుర్తించిన తర్వాత విధుల్లో వారి సామర్థ్యాన్ని గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్ట్ జరగనున్నది. పైన పేర్కొన్న విధుల్లో వారికి ఉన్న అనుభవాలను కలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. నియమితులయ్యేవారి సర్వీసు నిబంధనలను సీసీఎల్ఏ త్వరలో ఖరారు చేయనున్నది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న వీఆర్వో, వీఆర్ఏలు తీసుకుంటున్న పే స్కేల్ ఇకపైన గ్రామ పాలనాధికారి పోస్టుకూ వర్తిస్తుందని, కానీ వారి గత సర్వీసు మాత్రం లెక్కలోకి రాదని పేర్కొన్నారు.
Also Read: Telangana Govt : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాల జాతరే..