తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: CM Revanth Reddy: ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణతో పాటు సిటీలోని అన్ని రహదారులను అనుసంధానం చేసేలా లింకు రోడ్ల నిర్మాణం, కనెక్టివిటీ సౌకర్యం మెరుగుపడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ప్రణాళికతో ఈ లక్ష్యం నెరవేరాలన్నారు. తక్కువ సమయంలోనే ఆటంకాలు లేకుండా ప్రయాణాలు జరిగేలా చూడడం ప్రభుత్వ లక్ష్యమని నిర్దేశించారు.
పట్టణాభివృద్ధి అవసరాలపై హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితర విభాగాల అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన రివ్యూలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నగర జనాభా పెరగడంతో పాటు ప్రతీరోజు వేలాది కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, ఉపాధి అవసరాలతో ప్రజలు రోడ్డెక్కక తప్పదని, భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణను చేపడుతూనే కొత్త రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెంచాలని, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని స్పష్టం చేశారు.
Also Read: TG Govt on Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త కొలువులకు వేళాయేరా?
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న లింక్ రోడ్ల నిర్మాణం, ప్రధాన రహదారుల విస్తరణపై అధికారులు ఇచ్చిన వివరాలను ప్రస్తావించిన సీఎం రేవంత్ 49 రోడ్ల పనులపై పలు సూచనలు చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల మధ్య రోడ్ కనెక్టివిటీని పెంచడం, ప్రజలకు అవాంతరాలు తలెత్తకుండా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరే తీరుల రహదారుల విస్తరణ, నిర్మాణం ఉండాలని నొక్కిచెప్పారు. విశాల ప్రజా ప్రయోజనాలు నెరవేరడమే ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలన్నారు.
రోడ్ల విస్తరణకు భూ సేకరణ అనివార్యమవుతుందని, స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించి ప్రణాళికను రూపొందించాలన్నారు. భూ సేకరణ అవసరాలకు నిధులను కేటాయించడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, వాటి గురించి అధికారులు చింతించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. అదనంగా భూమిని సేకరించడానికి అధిక వ్యయం అవసరమవుతుందనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ప్రజల భవిష్యత్ అవసరాలు, నగరానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక కావడంతో వెనకాడాల్సిన పని లేదని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రెటరీలు శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ రాజ్ అహ్మద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. అనేక అంశాలపై ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలను వీరు వివరించారు.
Also Read: Telangana Govt: త్వరలో భారీ బదిలీలు.. ఆ 60 మంది అధికారులు?