Telangana Govt : ఇంతకాలం ఎక్స్ టెన్షన్ పేరుతో కీలక బాధ్యతల్లో ఉన్నవారిని టెర్మినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై క్రింది స్థాయి ఉద్యోగులతో పాటు నిరుద్యోగుల్లో సంతోషం నెలకొన్నది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని రిలీవ్ చేయడం ద్వారా తర్వాతి స్థానాల్లో ఉన్నవారికి పదోన్నతులు లభిస్తాయని, ఆ చైన్ సిస్టమ్‌లో క్రింది స్థాయిలో ఉన్న పోస్టులు ఖాళీ అయ్యి నోటిఫికేషన్ల ద్వారా లేదా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ జరుగుతాయని యువతలో కొత్త ఆశలు మొలకెత్తాయి. గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్ టెన్షన్ పేరుతో కీలక బాధ్యతలు అప్పజెప్పడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏండ్ల తరబడి పాతుకుపోయినవారికి ఎట్టకేలకు ఉద్వాసన పలకడంపై పాజిటివ్ స్పందన వచ్చింది.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్‌రావు మొదలు టాస్క్ ఫోర్స్ బాధ్యతలను రాధాకిషన్‌రావుకు, విద్యుత్ సంస్థలో దేవులపల్లి ప్రభాకర్ రావు, ఇరిగేషన్‌లో మురళీధర్.. ఇలా వందల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వారిని రకరకాల పేర్లతో సర్వీసులోనే కొనసాగించడం ఉద్యోగులలో అసంతృప్తికి కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్ టెన్షన్‌లో ఉన్న ఆఫీసర్ల లెక్కలు తీస్తే దాదాపు వెయ్యి మందికిపైగా ఉన్నట్లు తేలింది. ఒకవైపు ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు శాఖలవారీగా నోటిపికేషన్లు ఇస్తూనే గ్రూప్-1, 2, 3 పోస్టులకూ పరీక్షలు నిర్వహించింది. మరోవైపు ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లకు ఉద్వాసన పలకడంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఏర్పడింది.
Also Read: Viral Video: కారు ఆపిన ట్రాఫిక్ పోలీస్.. తొంగి చూసిన శునకం.. వీడియో వైరల్
రిటైర్ అయినా కీలక బాధ్యతల్లో ఉంటూ పెత్తనం చేస్తున్నారనే ఉద్యోగుల అభిప్రాయాలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో రిలీఫ్ లభించినట్లయింది. తప్పనిసరి అయితే మాత్రమే ప్రాజెక్టుల ప్రాధాన్యతకు అనుగుణంగా సీనియర్ల సేవలను వినియోగించుకునే అవకాశాలున్నాయి.