Telangana: వివిధ డిపార్టుమెంట్లలో వేర్వేరు హోదాల్లో పదవీ విరమణ చేసినా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ఎక్స్ టెన్షన్ తదితర పేర్లతో కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇలాంటి రిటైర్డ్ ఉద్యోగుల సేవలు మార్చి 31 వరకే ఉంటాయని, ఏప్రిల్ ఫస్ట్ నుంచి వారు వెళ్ళిపోవాల్సిందేనని పురపాలక శాఖ అదనపు కార్యదర్శి గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన శాఖల్లో సైతం ఇదే విధానం కొనసాగనున్నది.
పురపాలక శాఖ పరిధిలోని హెచ్ఎండీఏ, జలమండలి, జీహెచ్ఎంసీ, మెప్మా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్, అర్బన్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కుడా (కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రో రైల్, సుడా (సిద్దిపేట్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ), రెరా (రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ) తదితర విభాగాల్లో తాసీల్దార్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, ఆర్డీవో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానంగ్ సూపర్‌వైజర్.. ఇలా అనేక హోదాల్లో కొనసాగుతున్నవారంతా ఏప్రిల్ 1 నుంచి వెళ్ళిపోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read: CM Chandrababu: మమ్మల్ని పట్టించుకోలేదు.. చంద్రబాబుతో నిర్వాసితులు..
సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, హెచ్ఓడీలు ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో వారి సేవలను వినియోగించుకోడానికి వారికి గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లోని గడువు ఎప్పటివరకు ఉన్నా ఈ ఉత్తర్వులే ఫైనల్ అని, అమలు చేయాల్సిందేనని అదనపు కార్యదర్శి స్పష్టం చేశారు.