Tomato Prices Dropped: టమాటా వేయని వంటను ఊహించడం కష్టమే. వెజ్, నాన్ వెజ్ అన్న తేడా లేకుండా ప్రతీ వంటకంలోనూ టమాటా ఉండాల్సిందే. సంవత్సరంలో అన్ని రోజులు టమాటా అవసరం ప్రజలకు ఉంటుంది. అటువంటి టమాటాకు గత కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు అల్లాడిపోతున్నారు. తాజాగా రంగారెడ్డిలో ఓ రైతు రూ.3 లకే కేజీ టమాటాలను అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
4 ఎకరాల్లో టమాటా సాగు
టమాటా ధరలు నానాటికి పతనమవుతుండంతో పండించిన రైతు పరిస్థితి అద్వాన్నంగా మారుతోంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం గంగన్నగూడెంకు చెందిన రైతు నర్శింహులు ఈ ఏడాది వరితో పాటు టమాటాను సాగు చేశారు. తనకున్న 4 ఎకరాల భూమికి అదనంగా మరో ఎకరం తీసుకొని పంట పండించాడు. 4 ఎకరాల్లో టమాటాను సాగు చేయగా 56 బాక్సుల టమాటా దిగుబడి వచ్చింది. అంటే ఒక్కో పెట్టేకు 30 కేజీలు చొప్పున అన్నమాట.
కేజీకి రూ.3 మాత్రమే
రైతు నర్సింహులు తాను ఎంతో కష్టపడి పండించిన టమాటాను బుధవారం మహబూబ్ నగర్ రైతు బజార్ కు తీసుకెళ్లారు. తన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు. కానీ రైతు బజార్ లోకి అఢుగుపెట్టిన నర్సింహులకు గట్టి షాక్ తగిలింది. టమాటాను కొనుగోలు చేసేందుకు అక్కడి దళారులు ఆసక్తి కనబరిచలేదు. చివరికీ ఓ వ్యక్తి 56 బాక్సుల టమాటాకు గాను 39 మాత్రమే కొనుగోలు చేసేందుకు అంగీకరించాడు. అది కూడా 39 బాక్సులకు కేవలం రూ. 3,500 మాత్రమే చెల్లించాడు. అంటే కేజీకి రూ.3 అన్నమాట.
టామాటా పారబోత
మిగిలిన 17 టమాటా బాక్సులు ఎవరూ కొనుగోలు చేయడంతో రైతు నర్సింహులు లబోదిబోమన్నారు. అమ్మిన టమాటాకు సైతం అతి తక్కువ ధర రావడంపై కన్నీరు మున్నీరయ్యారు. గిట్టుబాటు ధర పక్కన పెడితే కనీసం పెట్టిన రవాణా ఛార్జీ కూడా దక్కలేదని నర్సింహులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మిగిలిన టమాటా బాక్సులను నవాబ్ పేట మండలం ఫతేపూర్ అడువుల్లో పారబోశారు. కనీసం జంతువులకైనా తను పండించిన టమాటా ఆహారంగా ఉపయోగపడుతుందని రైతు పేర్కొన్నారు.
Also Read: Panchayat Raj Lokesh Kumarc: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ యంత్రాంగం కీలక నిర్ణయం
దళారులు లాభపడుతున్నారా?
మార్కెట్ యార్డుల్లో టమాటా ధరలు దారుణంగా పతనమవుతున్నట్లు గత కొన్నిరోజులు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే బయట మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్ లో కేజీ టమాటా రూ.10-20 పలుకుతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో కొన్ని చోట్ల రూ.20-30 కూడా కేజీకి వసూలు చేస్తున్నారు. దీంతో టమాటా ధరలు పతనమంటూ వస్తున్న వార్తలు చూసి సాధారణ వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. పండించిన రైతు కంటే దళారులే ఎక్కువగా లాభపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.