CM Revanth Reddy (image credit:Twitter)
తెలంగాణ

CM Revanth Reddy: కడుపు నిండా విషం.. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy: పాతికేండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించిందని, ఇప్పుడు ఆ భూమిలో కొన్ని గుంటనక్కలు ఉన్నాయని ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. త్వరలోనే వాటికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కేటాయించిన భూమిని ఇప్పటివరకూ వెనక్కు తీసుకోలేదని, పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం చోద్యం చూసిందన్నారు. ఇప్పుడు న్యాయస్థానాల ద్వారా ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి దక్కేలా చొరవ తీసుకున్నామని, ఆ భూమికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఎలాంటి సంబంధం లేకున్నా పనిగట్టుకుని విమర్శలు చేసి రాద్ధాంతం సృష్టిస్తున్నాయన్నారు. పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ బుధవారం మాట్లాడుతూ, బహిరంగ వేలం ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రం అభివృద్ధి కావొద్దనేదే వారి కుట్ర :
అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేయాలని, విస్తరణ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంటే వాటికి అడ్డం పడుతున్నారని అన్నారు. చివరకు భూసేకరణ ప్రక్రియను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న హరీశ్‌రావును సూటిగా అడుగుతున్నా.. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా?.. వద్దా?.. రేడియల్ రోడ్లు వేయాలా?.. వద్దా?.. ప్రాంత అభివృద్ధి కోసం భూములు సేకరించాలా?.. వద్దా?.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా?.. వద్దా?..” అని నిలదీశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌజ్‌లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరని ప్రశ్నించిన సీఎం రేవంత్.. ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పనిని అడ్డుకునేలా కుట్రలకు పాల్పడడం ఏ రకంగా మంచిదని నిలదీశారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తాము తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, మొత్తం రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నామన్నారు.

అడ్డం పడే బదులు సహకరించండి :
అభివృద్ధి, భూసేకరణ విషయంలో అడ్డుపడొద్దని బీఆర్ఎస్ నేతలకు సూచించిన సీఎం రేవంత్.. భూములు కోల్పోయిన ప్రజలకు ఎలాంటి పరిహారం ఇవ్వాలో సూచనలు చేయాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఇస్తున్న పరిహారమంతా ప్రభుత్వ ఖజానా నుంచే తప్ప ఎవరి ఇంట్లో నుంచో ఇచ్చేది కాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయంటూ మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు రావొద్దనే కుట్రతో, దురుద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితికి పాల్పడుతున్నారని అన్నారు. నిజానికి రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదని, వెటర్నరీ మహిళా డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు.

అధికారం లేకపోవడంతో అసహనం :
ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితులపై సానుభూతితో ఉంటూ నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కుట్రలను తెలంగాణ సమాజం సహించదన్నారు. గడచిన 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పాలన సాగిస్తున్నామని, కడుపు నిండా విషం పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో బీఆర్ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారని, ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుందని ప్రశ్నించారు. గతంలో మల్లన్నసాగర్‌లో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసులు వేయించింది వాళ్లే.. తిరిగి వారిని పార్టీలో చేర్చుకున్నది గులాబీ నాయకులేనని సీఎం రేవంత్ గుర్తుచేశారు.

విపక్షాల పట్ల మాకు వివక్ష లేదు : సీఎం
రాష్ట్రమంతా ప్రభుత్వానికి ముఖ్యమని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్.. పార్టీలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అభివృద్ధిపై దృష్టి పెడుతున్నామన్నారు. ముఖ్యమంత్రిగా తన దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని, ఏ పార్టీవారైనా తనకు సమానమేనని అన్నారు. గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా ఆ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందు ప్రయత్నిస్తానని అన్నారు. సికింధ్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఇటీవల ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం తనను కలిశారని, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చానని గుర్తుచేశారు. మంచిని మంచి అనే అంటాం.. చెడును చెడు అనే అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవు.. మమ్మల్ని బద్నాం చేస్తే మీరు మంచివారు కాలేరు.. మేం ఎవరి పట్లా, ఏ నియోజకవర్గం పట్లా వివక్ష చూపం.. వివక్ష మా విధానమే కాదు.. అని స్పష్టం చేశారు.

Also Read: Rangareddy district: పరిశ్రమల్లో ఆ జిల్లానే టాప్.. ఏకంగా రూ.6,035కోట్ల పెట్టుబడులు

వాస్తవిక బడ్జెట్‌తో రాష్ట్రాభివృద్ధి :
డాంబికాలతో తమ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదని క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. చేయగలిగేదే చెప్తామన్నారు. ఒకసారి హామీ ఇచ్చినా, ఏ వేదికమీదనైనా చెప్పినా దాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇదే తమ ప్రభుత్వ విధానమన్నారు. ఆ విజన్‌తోనే రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు.

ఇందులో ప్రతీ శాఖకు, పథకానికి కేటాయించిన నిధులను దూరదృష్టితో ఆలోచించి ఆచరణాత్మకమైన తీరులో ప్రజలకు స్పష్టత ఇచ్చామన్నారు. అసెంబ్లీ వేదికగా పెట్టిన బడ్జెట్ 95% నిజం కాబోతున్నదని భరోసా కల్పించారు. అసహనానికి గురవుతున్న బీఆర్ఎస్ నేతలు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వానికి ఉపయోగపడేలా సూచనలు ఇవ్వాలని కోరారు.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!