Gaddam Prasad Kumar: : గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ‘హరితహారం’ (Harithaharam) ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా అటవీ సంపదను పెంచాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex CM KCR).. హరితహారానికి శ్రీకారం చుట్టారు. అయితే ప్రకటనలతో హడావిడీ చేయడం తప్పా మెుక్కలను నాటిన దాఖలాలు లేవని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా హరితహారం కార్యక్రమం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. విపక్ష పార్టీకి ఫ్యూజులు ఎగిరే స్థాయిలో సెటైర్లు వేశారు.
వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Sessions) సమావేశాల సందర్భంగా మంగళవారం (మార్చి 25) గత ప్రభుత్వం అమలు చేసిన హరితహారం కార్యక్రమంపై చర్చ జరిగింది. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో హరితహారం గురించి ప్రస్తావించారు. కేసీఆర్ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మెుక్కలు నాటామన్న ఆయన.. దీని ఫలితంగా అటవీ సంపద భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు. అటవీ కవచం 7 శాతం మేర పెరిగినట్లు సభలో వ్యాఖ్యానించారు.
స్పీకర్ సెటైర్లు
బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి (BRS MLA Prashanth Reddy) వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. హరితహారం కింద నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హాని చేసే కోనోకార్పస్ చెట్లు (Conocarpus Trees) పెద్ద సంఖ్యలో ఉన్నాయని ఆరోపించారు. ‘కోనోకార్పస్ మెుక్కలకు పెద్దగా నీళ్లు అవసరం లేదు. ఎక్కడ నాటినా పెరుగుతుంది. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తుంది. పిట్ట కూడా దాని మీద కూర్చోదు. అలాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మెుత్తం పెట్టారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రభుత్వానికి సూచన
కోనోకార్పస్ చెట్ల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక సూచనలు చేశారు. కోనోకార్పస్ చెట్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో గుర్తించి వాటిని తీసివేయాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాని వల్ల ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీలో గొప్పలు చెప్పుకునేందుకు హరితహారం ప్రస్తావన తీసుకొచ్చి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని కాంగ్రెస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కంపెనీలపై కమిషన్ సీరియస్.. రైతన్నలకు భరోసా
పరిశోధనల్లోనూ వెల్లడి
కోనోకార్పస్ మెుక్కల గురించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. చూడటానికి శంకు ఆకృతిలో ఉండటంతో పాటు త్వరగా పెరిగే గుణం వీటి సొంతం. దీంతో రోడ్లకు ఇరువైపులా వీటిని పెంచేందుకు అధికార వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఈ కోనోకార్పస్ మెుక్కలను అధికంగా నాటడం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా భూగర్భ జలాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని నాటితే వాటి వేర్లు భూమిలోతుల్లోకి చొచ్చుకెళ్లి తాగునీటి గొట్టాలు, డ్రైనేజీ పైపులను ధ్వంసం చేస్తున్నట్లు గుర్తించారు.