తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Congress Govt: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లో సర్కారు కొలువుల జాతర మొదలైంది. ఏడాది తిరక్కుండానే 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ్య నియామక పత్రాలు జారీ చేయడంతో మొత్తం భర్తీ అయిన కొలువుల సంఖ్య 58,868 అయింది. త్వరలో ఈ సంఖ్య లక్షకు చేరువ కానున్నది.
Also read: CM Revanth Reddy: ఇది రేవంత్ సర్కార్.. ప్రతీ నిర్ణయం ఓ సంచలనమే!
ఇప్పటికే గ్రూప్-1, 2, 3 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించడంతో నెల రోజుల్లో 2,711 పోస్టులు భర్తీ కానున్నాయి. దీనికి తోడు కొత్తగా 30,288 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రక్రియ మొదలుకానున్నది. ఇవి కూడా వీలైనంత తొందరగా భర్తీ చేసేలా ఆయా డిపార్టుమెంట్లు కసరత్తు చేస్తున్నాయి. వీటికి తోడు 14,236 అంగన్‌వాడీ పోస్టుల్నీ భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ కానున్నది. రెవెన్యూ శాఖలో అన్ని గ్రామాల్లో విలేజ్ లెవెల్ ఆఫీసర్లు (వీఎల్ఓ) ఉండేలా నియామకాలు త్వరలో జరగనున్నాయి. వీటన్నింటితో కలిపి 15 నెలల వ్యవధిలోనే లక్ష ఉద్యోగాల కల్పన రికార్డు నమోదు కానున్నది.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే గ్రూప్-1 కేటగిరీలో 563 పోస్టులు, గ్రూప్-2 కింద 783 పోస్టులు, గ్రూప్-3 పరిధిలో 1,365 పోస్టుల్ని భర్తీ చేసేందుకు పరీక్షలను నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. త్వరలో ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నది. ఆ తర్వాత ఆయా శాఖల ద్వారా అర్హులైనవారికి నియామక పత్రాలను ప్రభుత్వం అందించనున్నది.
Also read: Miss World 2025: ప్రపంచ అందాలన్నీ తెలంగాణ వైపు.. మే 31న మిస్ వరల్డ్ ఫైనల్ పోటీ..
అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై చర్చించిన మంత్రివర్గం 14,236 పోస్టులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జడ్పీ, మండల పరిషత్తుల్లో ఉన్న 524 ఆఫీసు సబార్డినేట్, నైట్ వాచ్‌మాన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ అయ్యాయి. కొత్తగా 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఇప్పటివరకు 15 నెలల్లో 58,868 పోస్టులు భర్తీ చేశారు.