TTD News: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులేఖలకు సంబంధించి టిటిడి కీలక ప్రకటన జారీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం అమలుపై టీటీడీ చేసిన పూర్తి ప్రకటన ఇదే.
తిరుమల శ్రీవారిని దర్శించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. అంతేకాదు దేశ విదేశాల నుండి సైతం శ్రీవారి దర్శనం కోసం ఎందరో భక్తులు తిరుమలకు వస్తారు. కొందరు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనభాగ్యం పొందుతారు. అయితే ఇటీవల తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టిటిడి పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపించాయి. పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని టిటిడికి లేఖల ద్వారా వివరించారు
టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమలలో ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ దశలోనే తిరుమలలో ప్రజాప్రతినిధుల లేఖల ద్వారా మోసాలకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బి.ఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి దర్శనం టికెట్లకు సంబంధించి పకడ్బందీగా చర్యలు చేపట్టారు.
అయితే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు దృష్టికి టిటిడి విషయాన్ని తీసుకెళ్లింది. సీఎం ఆదేశాలతో ఎట్టకేలకు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అమల్లోకి తీసుకుంటున్నట్లు టిటిడి సోమవారం ప్రకటన జారీ చేసింది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు.
ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని ఏ రోజు కా రోజు దర్శనం కల్పించనున్నారు. ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే ఆరు మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుంది.
Also Read: Karimnagar News: పిట్ట అరుపుకు ఉలిక్కి పడుతున్న గ్రామం.. ఇళ్లకు తాళాలు వేసి మరీ..
ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు స్వీకరించనున్నారు. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం టిటిడి ఈ మేరకు నిర్ణయించింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని సహకరించాలని టిటిడి కోరింది. కాగా టీటీడీ తాజా ఉత్తర్వులపై ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు.