తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Congress vs BRS Party: ప్లాన్ ప్రకారమే బీఆర్ ఎస్ వాకౌట్ చేసినట్లు కాంగ్రెస్ చెప్తున్నది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పేందుకు మనసు ఒప్పక పోవడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేమని భయంతో బీఆర్ ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ది. దీంతోనే ఉభయ సభల్లోనూ బీఆర్ ఎస్ వాకౌట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సభలో ఉంటే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనకు బీఆర్ ఎస్ నేతలు మద్ధతు తెలపాల్సిన పరిస్థితులు అనివార్యంగా మారేది.
ఈ నేపథ్యంలోనే ఊహించినట్లుగానే బీఆర్ ఎస్ తన వాకౌట్ ను ప్రకటించింది. ఉభయ సభల్లోనూ అధ్యక్షా…అని సీఎం సంభోదించిన నిమిషానికే బీఆర్ ఎస్ సభ్యులు గందరగోళానికి తెర లేపారు. దీన్ని ముందే గమనించిన సీఎం రేవంత్ రెడ్డి వారి నిరసనలు, నినాదాలను పెద్దగా లెక్కచేయలేదు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భారీ స్థాయిలో నినాదించినా, సీఎం సైలెంట్ గా స్మైల్ ఇస్తూ కూర్చొన్నారే తప్పా, ఎక్కడా రీయాక్ట్ కాలేదు. మంత్రులు మాత్రం సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు.
ఇక ఇదే అదనుగా భావించి బీఆర్ ఎస సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే బీఆర్ ఎస్ నేతల తీరు ఈ విధంగా ఉంటుందని కాంగ్రెస్ రెండు రోజుల క్రితమే పసిగట్టినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందుకే తమ సీఎం వాళ్ల గురించి పెద్దగా స్పందించలేదని క్లారిటీ ఇచ్చారు.
డీ మోరల్ అవుతున్న నేపథ్యంలో…
ఇప్పటికే పదేళ్ల నిర్లక్ష్య పాలనపై సమాధానాలు చెప్పలేక బీఆర్ ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి పైగా ఇప్పుడు ధన్యవాద తీర్మానం మద్ధతు, బట్జెట్ సెషన్స్ లో డిస్కషన్స్ వంటివి ఎలా డీల్ చేయాలని అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు పరేషాన్ అవుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కొందరు, పదేళ్ల నిర్లక్ష్యం అంటూ, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ.. ఉద్యమ ట్యాగ్ లైన్ ను విస్మరించాలంటూ మరొకరు ఇలా ఒక్కొక్కొరూ ఒక్కో తీరుగా బీఆర్ ఎస్ తప్పిదాలను నిలదీస్తుంటే, ఏం చేయాలో అర్ధం కాక ఆ పార్టీ సభ్యులు డీ మోరల్ అవుతున్నారు. దీంతోనే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనకు బీఆర్ ఎస్ డుమ్మా కొట్టిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఆ ఒక్క రోజు వచ్చి ..?
ఇక బడ్జెట్ సమావేశం రోజు కేసీఆర్ తో పాటు బీఆర్ ఎస్ సభ్యులంతా హాజరు కానున్నారు. అసెంబ్లీతో పాటు కౌన్సిల్ లోనూ సభ్యులు అటెంట్ అవుతారు. ఆ తర్వాత నిరసనలు, బాయ్ కాట్ పేరుతో ఎస్కేప్ కావాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిఫెన్స్ లోకి వెళ్లిన బీఆర్ ఎస్, బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ తమపై దాడి చేస్తుందని భావిస్తుంది.
ఈ భయంతోనే బీఆర్ ఎస్ నేతలు ఈ తరహాలో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చెప్తున్నది. మరోవైపు బీఆర్ ఎస్ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు మరోసారి పెట్టేందుకు కాంగ్రెస్ అన్ని ఆధారాలు, లెక్కలు, డాక్యుమెంట్లను రెడీ చేసినట్లు సెక్రటేరియట్ లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
చట్ట విరుద్ధంగా…
గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో చట్ట విరుద్ధంగా నిర్వహించిందని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. బడ్జెట్ కు ముందు గవర్నర్ ప్రసంగం పెట్టడం అనేది రాజ్యాంగం ప్రకారం వస్తున్న అనవాయితీ. అయితే 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బీఆర్ ఎస్ బడ్జెట్ సెషన్స్ నిర్వహించింది. 2023లోనూ అదే దిశగా అడుగులు వేయగా, కోర్టు జోక్యంతో గవర్నర్ ప్రసంగం పొందుపరచాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం మద్దతు తెలిపేందుకు బీఆర్ ఎస్ మొగ్గు చూపడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను అవమానపరిచిన ఏకైక రాజకీయ పార్టీ బీఆర్ ఎస్ అంటూ చురకలు అంటించారు.