Sajjanar – Harsha Sai: ఈ మధ్య ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు.. రింగ్ టోన్ కంటే ముందు ఒక హెచ్చరిక వస్తుండటం అందరూ గమనించే ఉంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, నేతల వరకు ఎవ్వరికి పడితే వాళ్లకు ఫేక్ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లకు చెక్ పెట్టేందుకు, అందరికీ అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. మీ కొచ్చిన పార్శిల్ లో డ్రగ్స్ ఉన్నాయి, మీ మీద కేసు బుక్ అవుతుంది, డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి అకౌంట్లలోని డబ్బులు కాజేస్తున్నారు సైబర్ క్రిమినల్స్.
అయితే ఇవి మాత్రమే కాదు.. సమాజంలో చాలా రకాల మోసపూరిత వ్యవహారాలు జరుగుతుంటాయి. వాటన్నింటిపై ప్రభుత్వమే దృష్టి సారించి నివారణ చర్యలు, ఇలా ఫోన్ కాల్స్ అలర్ట్ లు ఇవ్వాలంటే జరిగే ప్రమాదం చెల్లించుకునే మూల్యం భారీగా ఉంటుంది. ప్రధానంగా బెట్టింగ్ యాప్ ల ప్రభావం యువతపై అధికంగా ఉంటున్న పరిస్థితి. ఈ యాప్స్ తో ఎందరో యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు జరిగాయి. అందుకే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ ఎండీ… వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే ఆర్థిక కష్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
ఆ యాప్స్ ముసుగున జరుగుతున్న మోసాలను ఎండకడుతున్నారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ మోసాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఊబిలో చిక్కుకొని ఎంతో మంది అమాయక యువకులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారు కూడా దీనికి బాధ్యులే అవుతారు కాబట్టి సోషల్ ఇన్ ఫ్ల్యూయెన్సర్లు ప్రమోషన్స్ ఆపేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ప్రమోటర్లపై సమరం
కాగా, ఎవరైనా ఓ వ్యక్తికి కాలం కలిసొస్తుంటే ‘పట్టిందల్లా బంగారమవుతుంది’ అంటుంటారు. అదే రీతిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల విషయంలో సజ్జనార్ ట్వీట్ చేసిన వారు అరెస్ట్ కావడం ఇటీవల సంచలనంగా మారింది. ఇటీవల లోకల్ బాయ్ నాని గురించి ఆయన ట్వీట్ చేశారు. నాని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడాన్ని తప్పుబట్టారు. అయితే సజ్జనార్ ట్వీట్ ను సీరియస్ గా తీసుకున్న వైజాగ్ సీపీ… వెంటనే నానీని అరెస్టు చేసి లోపలేశారు. ఇదే బాటలో… మరికొంత మందిని కూడా అరెస్టుకు రంగం సిద్ధమైంది. అందులో వరంగల్ కు చెందని యూ ట్యూబర్ సన్నీ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సజ్జనార్ ఫేమస్ యూట్యూబర్ హర్షసాయిపై ట్వీట్ చేశారు. హర్షసాయి గతంలో మాట్లాడిన ఓ వీడియోను ట్యాగ్ చేసిన ఆయన.. అందులో యూట్యూబర్ చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. ఎంతో మంది అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైపోతుంటే హర్షసాయికి కనీసం పశ్చాత్తాపం లేదని విమర్శించారు. డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం అన్నట్లుగా ఇలాంటి ఇన్ ఫ్ల్యూయెన్సర్లు ప్రవర్తిస్తుంటారని, ఎవరు ఏమైపోయినా.. సమాజం ఎటు పోయినా, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదన్నట్లుగా వారి తీరు ఉంటుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది?
‘‘చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!’’ అంటూ సజ్జనార్ ట్వీట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.’’ అంటూ తన ట్వీట్ ద్వారా యువతకు పిలుపునిచ్చారు.
హర్షసాయి కేవలం తెలుగు యూట్యూబర్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా యూట్యూబర్. ప్రపంచ వ్యాప్తంగా అతనికి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్లు ప్రమోట్ చేయడం వల్లనే సామాన్యులు బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు. జీవితాలు ఛిద్రం చేసుకుంటున్నారు. కానీ హర్షసాయి దాన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రమోట్ నేను చేయకపోతే వేరే వాళ్లు చేస్తారు. అందరిని ఆపగలమా? అని సమాధానమిస్తున్నారు. పైగా బీదలకు సాయం చేస్తానని చెప్తుంటాడు కదా.. బెట్టింగ్ ప్రమోషన్స్ ద్వారా మరికొంత మందిని మోసగించడం కాదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా, హర్షసాయిపై సజ్జనార్ చేసిన తాజా ట్వీట్ సంచలనమైంది. ఇక అతనికి కూడా మూడినట్లే అని నెటిజన్లు పోస్టు పెడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. కాగా, ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల పై ప్రపంచ యాత్రికుడు అన్వేశ్ తో సజ్జనార్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అన్వేశ్ సజ్జనార్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!
ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.… pic.twitter.com/h0Vyxl2vXh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025