తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG Half Day Schools: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల టైమింగ్స్ మారాయి. ప్రభుత్వ పాఠశాలలు ఒక్క పూట మాత్రమే నడిచేలా ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ టైమింగ్స్ కు అనుగుణంగా అంగన్‌వాడీల వేళలల్లోనూ మార్పులు జరిగాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు శనివారం నుంచి ఒంటిపూట మాత్రమే సేవలందించనున్నాయి.
ఉదయం 8.00 గంటల మొదలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. రాష్ట్రంలో వేసవి ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అధికారులతో రివ్యూ నిర్వహించిన మంత్రి సీతక్క ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎలాగూ ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతున్నందున అంగన్‌వాడీ కేంద్రాలు సైతం అదే తరహాలో పనిచేయనున్నాయి.
పిల్లలకు ఇబ్బంది లేకుండా, ఎండలతో అనారోగ్యానికి గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు కూడా ఈ మేరకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు సైతం శనివారం నుంచి ఒంటిపూటగానే పనిచేయనున్నాయి.
నేటి నుంచి హాఫ్ డే స్కూల్స్
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు..
రాష్ట్రంలో ఎండలు విపరీతమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో శనివారం నుంచి ఒంటి పూట బడులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లల్లో ఈ నిబంధన అమలు చేయాలని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టంచేసింది. శనివారం నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించనున్నారు. ఇదిలా ఉండగా పదో తరగతి పరీక్షలు ఉన్న కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి.
Also Read: Ganja Seized: హైదరాబాద్ లో ఈ ఐస్ క్రీమ్ తిన్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ కావాల్సిందే!
ఇదిలా ఉండగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీచేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టంచేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.