Jagadish Reddy Suspended: తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న గందరగోళం నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు జగదీష్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఆయనపై ఈ సస్పెన్షన్ వేటు పడింది. తొలుత జగదీష్ రెడ్డి వేటుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు.. సభలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. దీంతో బడ్జెట్ సెషన్ మెుత్తం ఆయనపై వేటు పడింది.
మంత్రి సీతక్క ఫైర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అసభ్యకరంగా మాట్లాడటంపై సభలో మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. అతడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాలను అవమానించే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని సీతక్క ఫైర్ అయ్యారు. అటు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం జగదీష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ను అవమానించడం సహించరానిదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమర్యాదగా వ్యవహరించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ సభ్యత్వాలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ నేతల ఆందోళన
జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై విపక్ష బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సస్పెన్షన్ ను ఖండిస్తూ అంసెబ్లీలో పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. అనంతరం అసెంబ్లీ గేటు బయట జగదీష్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్యనేత కేటీఆర్ (KTR) బైఠాయించారు. సస్పెన్షన్ తప్పుబడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. జగదీష్ రెడ్డి అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Also Read: Heatwave Alert: మండిపోతున్న తెలంగాణ.. ఇవేమి ఎండలు బాబోయ్!
అసలేం జరిగిందంటే
అసెంబ్లీ సెషన్స్ రెండో రోజున గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్ పై జగదీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ సభ మీ సొంతం కాదంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. స్పీకర్ ను అవమానించేలా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.