Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం హాట్ హాట్ గా జరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress Party), విపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య వాడీ వాడీగా చర్చ జరిగింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ బుధవారం ప్రసంగించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగంపై ఇవాళ సభలో వాడీ వేడీ చర్చ మెుదలైంది. తొలుత బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (Jagadeesh Reddy), కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య కొద్దిసేపు డైలాగ్ వార్ నడించింది. ఈ క్రమంలో స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సభలో గందర గోళంగా మారింది. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
జగదీష్ రెడ్డి ఏమన్నారంటే?
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభ.. మీ సొంతం కాదంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్పీకర్.. అసహనంతో మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు. మరోవైపు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ.. సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ రెడ్డి కలుగజేసుకొని స్పీకర్ కు జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు పక్షాల వాదనలు – ప్రతి వాదనలతో సభ గందరగోళంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
‘సస్పెండ్ చేయాలి’
సభ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళితుడైన స్పీకర్ ను ఆయన అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డిని వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. స్పీకర్ కు క్షమాపణ చెప్పేవరకూ ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
గవర్నర్ ప్రసంగంపై ఫైర్
అంతకుముందు సభలో మాట్లాడిన బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి.. ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పుల తడకగా ఉందంటూ మండిపడ్డారు. గవర్నల్ మాట్లాడిన 36 నిమిషాల ప్రసంగంలో 360 అబద్దాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ చెప్పినట్లుగా రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు ఇచ్చారని సభలో నిలదీశారు. రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ అధికార పార్టీని ప్రశ్నించారు. ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చారని గవర్నర్ చెప్పారని.. ఎవరికి ఇచ్చారో చూపాలని జగదీశ్వర్ రెడ్డి సవాలు విసిరారు. ఈ క్రమంలో జగదీశ్వర్ రెడ్డి ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. విపక్ష నేతలు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడం మానుకోవాలని జగదీష్ రెడ్డి సూచించారు.
Also Read: Parking Dispute: దారుణం.. పార్కింగ్ కోసం ఇండియన్ సైంటిస్ట్ ను చంపేశారు
కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సభలో జగదీష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎదురు దాడికి దిగారు. గతంలో దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి బీఆర్ఎస్ చేసిందా అంటూ నిలదీశారు. భూమి లేని రైతులకు మూడెకరాలు ఇస్తానని చెప్పి ఆ హామీని నిలబెట్టుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసినవేనని అన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని కోమటిరెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయలేనిది.. తాము అధికారంలోకి వచ్చిన 14 నెలలోనే చేసి చూపించామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.