అంతా సస్పెన్స్
అంతుచిక్కన ఏఐసీసీ నేతల వ్యూహాలు
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో విస్మయం
మంత్రివర్గ విస్తరణలోనూ రిపీట్ తప్పదా?
కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా డౌట్
ఊహకందని పేర్లు వస్తాయనే అనుమానం
రాష్ట్ర ప్రతిపాదనలతో సంబంధం లేకుండా..
మీనాక్షి రాకతో ఆశావహుల్లో హాట్ డిబేట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు అంతుబట్టడంలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల పేర్లను పీసీసీ చీఫ్ పంపినా చివరికి ఏఐసీసీ చేసిన ఎంపిక సీనియర్ నేతలను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. మైండ్ బ్లాక్ అయిందంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ వేదికగానే కామెంట్ చేశారు. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రం నుంచి వెళ్ళిన జాబితాలోని పేర్లు ఖరారు కాకపోవడంతో ఇదే పరిస్థితి భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలోనూ, కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ రిపీట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆశలు పెట్టుకున్నా ప్రయోజనం లేదని, ఏఐసీసీ నుంచి వచ్చే లిస్టు తర్వాతే ఆలోచిద్దామనే భావనలోకి వెళ్ళిపోయారు నేతలు.
గతంలో పీసీసీ నుంచి వెళ్ళిన పేర్లలోనే ప్రయారిటీలను పరిగణనలోకి తీసుకుని ఒకరిని ఖరారు చేసే సంప్రదాయం ఉండేదని, కానీ ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఊహకు అందని తీరులో నిర్ణయాలు జరిగాయని, అధికారికంగా ప్రకటన వెలువడేంత వరకు పీసీసీకి కూడా అర్థం కాలేదన్న మాటలు గాంధీభవన్‌లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాలను గత కొంతకాలంగా గమనిస్తూ ఉన్న మీనాక్షి నటరాజన్ లాంఛనంగా బాద్యతలు చేపట్టకముందే రాష్ట్రంలో అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారని, ఆమె మార్కు పర్యవేక్షణ కనిపిస్తూ ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీపాదాస్ మున్షీ ఉన్నంతకాలం తీన్మార్ మల్లన్నకు ఇచ్చిన షోకాజ్ నోటీసు గడువు ముగిసినా చర్యలు లేవని, మీనాక్షి వచ్చిన మరుసటి రోజే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తుచేసుకున్నారు.
మంత్రివర్గ విస్తరణపై పీసీసీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, ఆశావహులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏఐసీసీ మాత్రం ఇంతకాలం నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ.. ఇలా కుల సమీకరణాల మేరకు ఎవరికి చాన్స్ ఇస్తే బాగుంటుందో పీసీసీ నుంచి ఏఐసీసీకి ప్రతిపాదనలు వెళ్ళాయి. కానీ తుది నిర్ణయం జరగలేదు. ఇప్పుడు మీనాక్షి వచ్చిన తర్వాత చర్చల్లోనే లేని మంత్రివర్గ విస్తరణ ప్రాసెస్ వేగవంతం కావచ్చని, రాష్ట్రం నుంచి వెళ్ళిన పేర్ల స్థానంలో ఊహకు అందని తీరులో కొత్త వ్యక్తుల పేర్లు చేరొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎంతటి సీనియర్ నాయకుడు పైరవీ చేసినా ఏఐసీసీ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్, రిపోర్టు ఆధారంగా పేర్లు ఫైనల్ అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పదవులు దక్కుతాయనే ఆశలు పెట్టుకోవద్దనే అంచనాకు వెళ్ళారు.
మంత్రిపదవి ఖాయమంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ విస్తరణకు ముహూర్తం ఆలస్యమవుతూ ఉండడంతో గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఆశలు లేవు.. అనే నిరుత్సాహ స్వరాన్ని వినిపించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్‌సాగర్‌రావు సైతం ఇప్పటివరకూ నమ్మకాలు ఉన్నా.. జాప్యం జరుగుతుండడంతో పట్టించుకోవడమే మానేశానని వ్యాఖ్యానించారు. పార్టీలో తీసుకునే నిర్ణయాల్లో మీనాక్షి మార్కు కనిపిస్తుండడంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాల్లోనూ రిపీట్ కావొచ్చని, ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథా ప్రయాసే అనే డిజప్పాయింట్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు కొందరు నేతలు. రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వెళ్ళినా ఏఐసీసీ వ్యూహం ప్రకారమే తుది నిర్ణయం జరుగుతున్నందున ఏవో అద్భుతాలు జరుగుతాయనే భ్రమల్లేవనే డెసిషన్‌కు వచ్చారు.
Also Read: తెలంగాణలో మరో కొత్త పథకం.. రూ. 3 లక్షలు పొందే ఛాన్స్.. డోంట్ మిస్