brs
తెలంగాణ

BRS: మహిళలను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం?

మహిళలకు నాడు నేడు

నాటి ఆర్థిక మంత్రిగా హరీశ్‌ రావు చిన్నచూపు!
మూడేళ్లపాటు పైసా విధిలించని గులాబీ సర్కార్
వడ్డీలేని రుణాల పేరుతో అసలుకే ఎసరు
కాగితాలపైనే సంక్షేమం చూపిన గత ప్రభుత్వం
ఉసురు తగిలిందంటూ మహిళల శాపనార్ధాలు
ఇప్పుడు వడ్డీ బకాయిలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : గత ప్రభుత్వం మహిళలకు పక్షపాతి అని, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని ప్రకటనలు చేసింది. కానీ, ఆచరణలో మాత్రం శూన్యమని బీఆర్ఎస్ విడుదల చేసిన నిధులే స్పష్టం చేస్తున్నాయి. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి సైతం చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి. వడ్డీలేని రుణాల పేరుతో అసలుకే ఎసరుపెట్టారని, మహిళలకు చెల్లించాల్సిన వడ్డీ కూడా బాకీపడ్డారని మహిళలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీమా చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.

ఆచరణలో మాత్రం విఫలం
మహిళలను ఆర్ధిక పరిపుష్టి సాధించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు వరాలు ప్రకటించింది. వడ్డీ లేని రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారని సంవత్సరాల వారీగా రిలీజ్ చేసిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20లో మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ కింద 602.74కోట్లు చెల్లించాల్సి ఉండగా 386.99కోట్లు చెల్లించింది. మరో 215.75కోట్లు పెండింగ్‌లో పెట్టింది. 2020-21లో 826.79 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం 22.88కోట్లు చెల్లించి 803.91కోట్లు పెండింగ్‌లో పెట్టింది. ఈ రెండేళ్లలోనే మహిళా సంఘాలకు 1019.66కోట్లు వడ్డీ బకాయిపడింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్దిని స్పష్టం చేసింది.

మూడేళ్ల పాటు చెల్లింపులు నిల్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు ఇస్తున్నామని ప్రకటనలు చేసింది. కానీ అవి ప్రకటనలకే పరిమితం అయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. 2021-22లో 943.9కోట్లు మహిళలకు వడ్డీ చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. 2022-23లో 785.18కోట్లు చెల్లించాల్సి ఉండగా పెండింగ్‌లోనే పెట్టింది. 2023-24లోనూ మహిళా సంఘాలకు వడ్డీ రూపేనా 326.57కోట్లు చెల్లించాల్సి ఉండగా వాటిని సైతం పెండింగ్‌లోనే పెట్టింది. అంటే ఈ మూడు నెలల్లోనే 2055.65కోట్లు పెండింగ్‌లో పెట్టింది. మొత్తం 2019-20 నుంచి 2023-24 వరకు ఈ ఐదేళ్లలో 3075.31 కోట్లు పెండింగ్‌లో పెట్టింది.

నాటి ఆర్థిక మంత్రిగా హరీశ్‌రావు
గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారు. అయితే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల విషయంలో, నిధుల విడుదలలో చొరవ చూపలేదని మహిళలే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నివేదికలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఐదేళ్లు 3వేల కోట్లు పెట్టి మహిళలను మోసం చేశారని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే, 21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వకుండానే మోసం చేశారని హరీశ్‌రావు వ్యాఖ్యలు చేయడంతో మంత్రి సీతక్క సైతం ఘాటుగా స్పందించారు. రూ.5 లక్షల వరకు మాత్రమే ఎస్‌హెచ్‌జీ, స్త్రీ నిధి రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణం అని 2015లో అసెంబ్లీలో బీఆర్ఎస్ జీవో ఇచ్చిందని, కానీ వడ్డీ చెల్లించకుండానే ఇచ్చినట్లు మోసం చేసిందని సీతక్క కౌంటర్ ఇచ్చారు. వడ్డీలేని రుణాల పేరుతో అసలుకే ఎసరు పెట్టారని మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. గత ప్రభుత్వానికి మహిళల ఉసురే తగిలిందని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

వడ్డీ బకాయిలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ బకాయిల చెల్లింపుపై ఫోకస్ పెట్టింది. ఏ సంవత్సరం నుంచి ఏ సంఘానికి బాకాయి ఉంది, ఎంత బకాయి ఉంది, వాటిని ఎలా మాఫీ చేయాలి, ఎన్ని సంఘాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా మహిళా సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆదుకునే చర్యలకు సైతం శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లింపు ప్రక్రియ చేపట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే 400 మంది మహిళలకు 40 కోట్లకు పైగా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వడ్డీ చెల్లింపులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పెండింగ్ బకాయిల చెల్లింపులపై కూడా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆర్థిక చేయూత అందించి వ్యాపారా రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్