దక్షిణాన జనాభా సంక్షోభం
ఒక్కో మహిళకు సగటున పుడుతున్నది 1.5 మందే
దేశంలోనే దిగువ నుంచి రెండో స్థానంలో తెలంగాణ
జాతీయ సగటు కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాట కనిష్టంగా 1.4 మంది
అత్యధికంగా బిహార్‌లో 3, యూపీలో 2.7 చొప్పున
ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడం శిక్షగా మారిందా?
జనన, మరణాల మధ్య పెరుగుతున్న సమతుల్యం
డీలిమిటేషన్ సమయంలో చర్చగా మారిన లెక్కలు
జనాభా ప్రాతిపదికనే ఎంపీ సీట్లు ఖరారంటూ చర్చలు
కేంద్ర సర్కార్ రిపోర్టులతో అలర్టయిన రాష్ట్ర ప్రభుత్వం
పిల్లల్ని కనాలంటున్న దక్షిణాది నేతలు
Population Crisis in Southern States: “మేమిద్దరం.. మాకిద్దరు”, “ఇద్దరు వద్దు.. ఒక్కరే ముద్దు” ఇవన్నీ ఒకప్పటి నినాదాలు. ఇవే ఉత్తరాదిన(North India) “అగలా బచ్చా అభీ నహీ.. తీన్ కే బాద్ కభీ నహీ” అని వినిపించేది. కానీ, ఇప్పుడు వాటికి కాలం చెల్లింది. ‘‘పిల్లల్ని కనండి జనాభా పెంచండి’’ అనేది నేటి అవసరంగా మారింది. ఏకంగా ఏపీ(AP), తమిళనాడు(Tamilnadu) ముఖ్యమంత్రులే ఈ పిలుపునిస్తున్నారు. చట్ట సభల్లో ఎమ్మెల్యే(MLA), ఎంపీ(MP) సీట్లకు జనాభా లెక్కలే ప్రామాణికం కావడంతో ఎంత ఎక్కువ జనాభా ఉంటే అన్ని సీట్లు పెరుగుతాయి. అందుకు రాజకీయ నాయకులు పిల్లల్ని కనాలని ప్రజలకు పదేపదే చెబుతుండడం కొత్త చర్చకు దారి తీసింది.
గ్రహించలేకపోయిన దక్షిణాది రాష్ట్రాలు
పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయడానికి 1970వ దశకంలో కుటుంబ నియంత్రణ(Family Planning) విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి), తమిళనాడు, కర్ణాటక(Karnataka), కేరళ(Kerala) తదితర దక్షిణాది రాష్ట్రాలు(Southern States) పకడ్బందీగా అమలు చేశాయి. కానీ, ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్(Bihar), ఉత్తరప్రదేశ్(UP), మధ్యప్రదేశ్(MP), మహారాష్ట్ర(Maharashtra), హర్యానా(Haryana), రాజస్థాన్(Rajasthan) తదితర రాష్ట్రాలు మాత్రం దీన్ని లైట్‌గా తీసుకున్నాయి. దీంతో దేశ జనాభాలో ఉత్తరాది రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గింది. డీలిమిటేషన్(Delimitation)కు ఇది సంకటంగా మారుతుందని దక్షిణాది రాష్ట్రాలు అప్పట్లో గ్రహించలేకపోయాయి.
భవిష్యత్తులో ప్రమాదమే..
దేశంలోని మరే రాష్ట్రంలో కంటే తమిళనాడులో ప్రతి మహిళ సగటు సంతానం 1.4గా ఉంటే ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నది. బిహార్‌లో ఇది 3.0గా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో 2.7, మధ్యప్రదేశ్‌లో 2.6 చొప్పున ఉన్నది. చనిపోతున్న సంఖ్యతో పోలిస్తే కొత్తగా పుట్టేవారి సంఖ్య కూడా 1970వ దశకంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని శాంపిల్ సర్వే సిస్టమ్ గణాంకాలతో పాటు నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాజకీయపరంగా ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు పెరిగే సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తులో జనన, మరణాల అసమతుల్యత అనేక అంశాల్లో ఉపద్రవంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో 1.5 మాత్రమే..
డీలిమిటేషన్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ(Telangana) సచివాలయం అధికారులు మొత్తం జనన మరణాలను, సంతానోత్పత్తిని, ప్రతి ఏటా పెరుగుతున్న జనాభా లెక్కలను చూసి ఆందోళనకు గురయ్యారు. ఉమ్మడి కుటుంబం స్థానంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వ్యవస్థ రావడంతో సంతానోత్పత్తి తగ్గుతున్నదని, భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి యువతరం బాగా తగ్గిపోయే ప్రమాదమున్నదని, ఇది సమాజ పురోగతికి ప్రతిబంధకంగా మారుతుందని, అభివృద్ధి సూచికల్లోనూ ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి 2.1గా ఉంటే తెలంగాణలో 2020 నాటికి 1.5 మాత్రమే. భవిష్యత్తులో మరింత పడిపోతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
దక్షిణాది నేతల డిమాండ్ ఇదే..
కేంద్ర ప్రభుత్వం 1976లో తీసుకొచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ విధానం తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారిందని, డీలిమిటేషన్ లాంటి అంశాల్లో పనిష్‌మెంట్‌గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తమిళనాడు తర్వాత అతి తక్కువ సంతానోత్పత్తి ఉన్నది తెలంగాణలోనే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ (1.5), కర్ణాటక (1.6), కేరళ (1.5) చొప్పున ఉన్నాయి. దేశంలో మొట్టమొదటి సెన్సస్ (1951 జనాభా లెక్కలు)లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2% ఉంటే, 2022 నాటికి అది 19.8%కి పడిపోయింది. అదే సమయంలో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల వాటా 39.1% నుంచి 43.2%కి పెరిగింది. కరోనా కారణంగా 2021లో జరగాల్సిన సెన్సస్ వాయిదా పడడంతో త్వరలో అది ప్రారంభమవుతున్నదన్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల లెక్కలు ఆసక్తికరంగా మారాయి. ఎలాగూ కుటుంబ నియంత్రణ ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉన్నందున తక్కువ జనాభా ఉన్నట్లే తేలుతుందన్నది చంద్రబాబు, స్టాలిన్, రేవంత్ రెడ్డి, పినరయి విజయన్ అభిప్రాయం. అందుకే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ (డీలిమిటేషన్)కు జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నాలుగో స్థానంలో తెలంగాణ
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జనన మరణాల నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు నమోదవుతున్నట్లు (2011 సెన్సస్ లెక్కలతో పోలుస్తూ ఎస్ఆర్ఎస్, ఎన్‌హెచ్ఎఫ్ఎస్ రిపోర్టుల్లోని వివరాల ఆధారంగా) ప్లానింగ్ డిపార్టుమెంటు అధికారులు గ్రహించారు. 20 ఏండ్లుగా సంతానోత్పత్తి తగ్గడంతో రానున్న రోజుల్లో మొత్తం జనాభాలో యువత శాతం తగ్గి వృద్ధుల శాతం పెరిగిపోతుందన్నది ఆ శాఖ అధికారుల అభిప్రాయం. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జననాల రేటు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా పుడుతున్న పిల్లల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, జననాల సంఖ్య అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు తేలింది. ఎస్ఆర్ఎస్ డేటా ప్రకారం ఏటా ప్రతి వెయ్యి మంది జనాభాలో కొత్తగా పుడుతున్న శిశువుల సంఖ్య జాతీయ స్థాయిలో సగటున 19.5 మంది ఉంటే తెలంగాణలో అది 16.4 మందే. మరణాల విషయంలో మాత్రం జాతీయ సగటుకు సమానంగానే తెలంగాణలోనూ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతీ ఏటా నమోదయ్యే జననాలు, మరణాల విషయంలో (రీప్లేస్‌మెంట్ రేషియో 2.1% మాత్రమే)నూ సమతుల్యం లోపించినట్లు గ్రహించారు.
డీలిమిటేషన్ నేపథ్యంలో పెద్దఎత్తున చర్చ
దేశంలో ఒక మహిళ సగటున 2.01 మంది పిల్లలకు జన్మనిస్తుంటే తెలంగాణలో 1.5 మందికే పరిమితం కావడంతో ఇప్పటి కుటుంబాల ప్రయారిటీ మారిందని, ఆర్థిక అంశాలే ఇందుకు కారణమని కులగణన ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకర సంకేతమని అభిప్రాయపడ్డారు. జననాల రేటు తగ్గిపోతూ ఉంటే యువతరం నిష్పత్తి పడిపోతుందని, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని, ఇది సమాజానికిగానీ ప్రభుత్వానికిగానీ మంచి పరిణామం కాదని, అభివృద్ధి అంశాల్లో తీవ్రమైన ప్రభావమే చూపిస్తుందన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడం, చిన్న కుటుంబాలు (న్యూక్లియర్) పెరగడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలను కన్నా ఒత్తిడిలో వాళ్ల పెంపకంపై శ్రద్ధ చూపలేకపోవడం, కుటుంబ ఖర్చులు, విద్యా ఖర్చులు పెరిగిపోవడం ఇలాంటి అంశాలన్నీ జననాల నిష్పత్తి తగ్గడానికి కారణమవుతున్నాయన్నది ఆ అధికారి వ్యక్తిగత అభిప్రాయం. ఎస్ఆర్ఎస్ నివేదికలోని గణాంకాలను వివరిస్తూ, ఇలాంటి పరిస్థితులే డీలిమిటేషన్ విషయంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయన్నారు.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదికి తీవ్ర అన్యాయం
కేంద్ర ప్రభుత్వం చేసిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరవాత జరిపే జనాభా లెక్కల మేరకు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల చట్టం కూడా అమల్లోకి వస్తుంది. డీలిమిటేషన్ ప్రక్రియకు జనాభా లెక్కలే ప్రామాణికమైతే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందన్నది పొలిటీషియన్ల ఆందోళన. పైనున్న రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గుతాయన్నది వారి ఆవేదన. అంతిమంగా ఇది దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చెలాయించడానికి దోహదపడుతుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యక్తం చేసిన అభిప్రాయం. సరిగ్గా ఈ ప్రమాదాన్ని పసిగట్టినందునే ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు ఒకడుగు ముందుకేసి కుటుంబ నియంత్రణను పక్కన పెట్టి వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చారు. త్వరలో తెలంగాణ సీఎం కూడా ఇలాంటి పిలుపునే ఇస్తారనే చర్చ కూడా మొదలైంది. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.8%గా ఉన్నప్పటికీ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో మాత్రం 5.2% కంటే ఎక్కువే ఉన్నది. జాతీయ సంపదకు రాష్ట్రాలందిస్తున్న ఆర్థిక సహకారం ఆధారంగా డీలిమిటేషన్ జరగాలన్నది బీఆర్ఎస్ లాంటి కొన్ని పార్టీల డిమాండ్.