MLC Elections: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)కు నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్రంలో ఓ వైపు అధికార కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తును మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల విషయంలో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.అయితే… ఇప్పటికే లిస్ట్ హైకమాండ్ వద్దకు చేరింది. నామినేషన్ల ప్రక్రియ సోమవారమే ప్రారంభమవనున్న నేపథ్యంలో మరికాసేపట్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎవరికి అవకాశం దక్కనుంది అనేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
కాగా ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్‌కు నాలుగు దక్కనున్నాయి. ఈ నాలుగు స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ(Meenakshi Natarajan) నటరాజన్ తదితరులు ఏఐసీసీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు.
ఇదిలావుంటే…అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒక ఎమ్మెల్యే పదవితో పాటు మరో ఎమ్మెల్సీని కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రామిస్ చేసింది. ఆ మేరకు ఇప్పడు జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న నాలుగింటిలో తమకు ఒకటి తమకు కేటాయించాలని సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌ను గట్టిగానే ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై రాహుల్‌గాంధీని కూడా సంప్రదించినట్లు సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కాకుండా భవిష్యత్తులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక, సామాజిక వర్గాల వారీగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కో సీటు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. అందుకే ఈ సారి సీపీఐ(CPI)ను పక్కకు పెట్టాలని చూస్తున్నది. ఎస్సీ వర్గీకరణకు ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం తెలిపినందున వారికి ఒక టికెట్ ఇస్తారని అందరూ భావిస్తున్నారు. అందునా అద్దంకి దయాకర్ కు ఈ సారి టికెట్ దక్కకపోతే అసంతృప్తి వేరే లెవెల్ కు వె ళ్లనుంది. ఎస్సీ మాదిగవర్గాలకు గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో రెండు టికెట్లు అడిగితే కాంగ్రెస్ ఒకటే కేటాయించింది. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి తమకే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని మాదిగ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. ఇక, చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ… ఈసారి కొత్తవాళ్లకే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారికి నో ఛాన్స్ అని కూడా గట్టిగా వినబడుతోంది. ఏదైమైనా మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడనుంది. అలాగే… సీపీఐ దక్కుతుందా లేదా అనేది కూడా తేలిపోతుంది.
కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20 వతేదిన జరగనున్నాయి. 10వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.