కోటీశ్వరులను చేసి తీరుతాం
అదానీ, అంబానీలతో పోటీ పడాలి
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం
మహిళా సంఘాలకే రైస్ మిల్లులు
గురుకులాల పౌష్టికాహార బాధ్యత కూడా
సంఘాల సభ్యులను కోటికి చేరుస్తాం
చేరేందుకు కనిష్ట వయసు 15 ఏండ్లకు కుదిస్తాం
60 ఏండ్ల పైబడ్డ వారినీ కొనసాగిస్తాం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. అప్పటివరకు తాను నిర్విరామంగా కృషి చేస్తానని నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం వన్ ట్రిలియన్(One Trillion) డాలర్లకు తీసుకొచ్చేవరకు ప్రజాప్రభుత్వం పోరాడుతూనే ఉంటుందని రేవంత్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మహిళా శక్తి(Indira Mahila Shakthi) కార్యక్రమంలో మాట్లాడారు. రాణీరుద్రమ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఆడబిడ్డలు మహిళా శక్తిని చాటారన్నారు.
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు
ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు, గోదాముల్లో నిల్వ చేయం, మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి, ఎఫ్ సీఐకి సరఫరా చేసే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పజెప్తామన్నారు. కొందరు మిల్లర్లు వడ్లను పందికొక్కుల్లా కాజేస్తున్నారని ఆరోపించారు. అందుకే వీటి బాధ్యత మహిళా సంఘాలకు అప్పజెప్పామన్నారు. రైస్ మిల్లుల ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం ఇవ్వడంతోపాటు అవసరమైన రుణాలు కూడా మంజూరు చేస్తుందని చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజీల్లో విద్యార్థులకు పౌష్టికాహారం మహిళా సంఘాల నుంచి సరఫరా చేయాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
సోలార్ విద్యుత్ ఒప్పందాలు.. ఆర్టీసీ బస్సులు..
ఐకేపీ సెంటర్లు నిర్వహించే మహిళలకు గతంలో డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదని.. కానీ తాము వెంటనే చెల్లిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను సంఘాలకే అప్పగించామని, గతంలో జత బట్టలు కుడితే రూ.25 ఇస్తే తాము దానిని రూ.75కు పెంచామని రేవంత్ గుర్తు చేశారు. అదానీ, అంబానీలు మాత్రమే నిర్వహించే సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాల చెంతకు చేర్చామని సీఎం అన్నారు.
రేవంతన్నగా బాధ్యత తీసుకుంటున్నా..
మహిళలు పరిపాలనలో భాగస్వాముల కావాలని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చారని.. సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్లకు మద్దతు పలికారని రేవంత్ రెడ్డి కొనియాడారు. సంఘాల్లోని మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే వారికి సీట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరంలోనే రూ.21 వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇచ్చి మహిళలు తలెత్తుకునేలా చేశామని సీఎం తెలిపారు. ప్రస్తుతం మహిళా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, వారి సంఖ్యను కోటికి పెంచుతామన్నారు. మహిళా సంఘాల్లో చేరే మహిళల వయస్సును 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించడంతో పాటు 60 ఏళ్లకుపైన ఉన్నవారిని తీసుకుంటామని సీఎం వెల్లడించారు. మొదటి తరం ఇందిరమ్మను అమ్మ అని పిలిచారని, రెండో తరం ఎన్టీఆర్‌ను అన్నను చేశారని.. ఇప్పుడు రేవంతన్నగా మీరంతా తనను పిలుస్తున్నారని సీఎం అన్నారు. తనను కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారని, అన్న అంటే ఆ కుటుంబాల బాధ్యతను తీసుకోవడమేనని సీఎం భావోద్వేగంతో అన్నారు. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తిగా తీసుకొని కోటి మందిని అభివృద్ధిని పథంలోకి తీసుకెళతానని సీఎం తెలిపారు.
Also Read: రాష్ట్రానికి పదేండ్ల చంద్రగ్రహణం వీడింది: సీఎం రేవంత్ రెడ్డి