ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చింది 29 స్థానాలే
డీలిమిటేషన్ అస్త్రంతో మరింత వివక్షకు గురి
ఉత్తరాదిలో పంజాబ్ లాంటి రాష్ట్రాలకూ నష్టం
‘బీమారు’ రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి
1971 జనాభా లెక్కలే ప్రామాణికం కావాలి
అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టరు?
హిందీ ఆప్షనల్ మాత్రమే.. బలవంతమొద్దు
బీజేపీకి అనుబంధ సంస్థలుగా ‘నైస్’
మోదీతో వ్యక్తిగత వైరం లేదు.. విధానాలపైనే కొట్లాట
హైదరాబాద్ సిటీకి 450 ఏండ్ల చరిత్ర ఉన్నది
చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ పేటెంట్ కాదు
‘ఇండియా టుడే కాంక్లేవ్’లో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ‘ఏం చేసినా బీజేపీ(BJP)కి దక్షిణాది(South States)లో సీట్లు రావడం లేదు. అధికారమూ(Power) దక్కట్లేదు. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఇందుకు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ(Delimitation) అనే ఆయుధాన్ని(Weapon) ఎంచుకున్నది. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కుట్ర(Conspiracy) పన్నింది. దేశం మొత్తం మీద బీజేపీ 240 స్థానాల్లో గెలిస్తే దక్షిణాది నుంచి వచ్చింది 29 సీట్లే. అందుకే దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పంజాబ్ లాంటి రాష్ట్రాలూ డీలిమిటేషన్ విషయంలో అన్యాయానికి గరవుతాయి. ఇవన్నీ కలిసి బీజేపీ మీద కొట్లాడాల్సిన అవసరం ఉన్నది’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ నియంత్రణ పాలసీ కారణంగానే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా కంట్రోల్ అయిందని, ఇప్పుడు జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్) రాష్ట్రాల(BIMARU States)కే ఎక్కువ లబ్ధి జరుగుతుందన్నారు. ఈ కారణంగానే 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరగాలని తాము పట్టుబడుతున్నామన్నారు. ఈ అంశాన్ని తొలుత తానే లేవనెత్తానని చెప్పారు. కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసినందుకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
ప్రో రేటా ప్రకారం చూసినా నష్టమే
ప్రొ రేటా(Pro Rata) ప్రకారం సీట్లు పెరుగుతాయని, ఎవరికీ నష్టం జరగదని అమిత్ షా(Amith Sha) చెప్తున్నా పంజాబ్(Punjab) లాంటి రాష్ట్రం కూడా నష్టపోతుందని సీఎం రేవంత్(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. యూపీలో ప్రస్తుతం 80 సీట్లు ఉంటే 50% నిష్పత్తితో పెంచాలనుకుంటే అక్కడ 120 అవుతాయని, అదే తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 స్థానాలు 60 అవుతాయని, ప్రోరేటా ఫార్ములాను అనుసరిస్తే ఈ రెండు రాష్ట్రాల మధ్యనే 60 సీట్ల తేడా ఉన్నదని వివరించారు. ఒక్క రాష్ట్రంతోనే ఇంత తేడా వస్తే ఇక మిగిలిన రాష్ట్రాలను కూడా లెక్కిస్తే పరిస్థితి ఏమవుతుందని ఎదురు ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు 126 సీట్లు ఉంటే ప్రోరేటా ప్రకారం 50% పెరిగితే అదనంగా 62 సీట్లు పెరుగుతాయని, అప్పటికీ 188కే చరుకుంటాయని, కానీ ఉత్తరాదిన సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు. డీలిమిటేషన్ పై బీజేపీ అఖిలపక్షం ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరంలేదని.. ఆయన విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
గుజరాత్ మోడల్ ఔట్ డేటెడ్
గుజరాత్(Gujarat) మోడల్ కాలం చెల్లిన నమూనా అని, అది టెస్ట్ మ్యాచ్ లాంటి మోడల్ అని, కానీ తెలంగాణది ట్వంటీ ట్వంటీ (20-20) మోడల్ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నమూనా దేశానికే నమూనా అవుతుందన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్ మార్కెటింగ్‌కు కూడా ఆయనే అంబాసిడర్‌గా ఉండి రాష్ట్రం కోసం పోరాడుతున్నారని అన్నారు. దేశానికి ప్రధాని అయిఉండి గుజరాత్ కు పెట్టుబడులను తరలించడం కరెక్ట్ కాదన్నారు.
తెలంగాణ బెస్ట్ మోడల్
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. ఈ మూడు తెలంగాణ ప్రాధాన్యాంశాలని, ఇదే తెలంగాణ మోడల్(Telangana Model) అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉన్న మౌలిక వసతులు(Infrastructure) అహ్మదాబాద్ లో లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం అహ్మదాబాద్, ముంబయి, బెంగళూర్, ఢిల్లీ లాంటి నగరాలతో పోటీ పడట్లేదని, న్యూయార్క్, సియోల్, టోక్యో లాంటి అంతర్జాతీయ నగరాలతో తో పోటీపడాలనుకుంటున్నామన్నారు.
గుజరాత్ కంటే తెలంగాణ ముందంజ
గుజరాత్ కంటే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. తెలంగాణలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ పూర్తైతే హైదరాబాద్ ప్రపంచంలో అత్యుత్తమంగా నగరమవుతుందన్నారు. కోవిడ్ సమయంలో మూడో వంతు ఔషధాలను తెలంగాణ సరఫరా చేసిందని.. దేశంలోని 35% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని గుర్తుచేశారు. ఐటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదన్నారు.
450 ఏండ్ల క్రితమే హైదరాబాద్ నిర్మాణం
హైదరాబాద్(Hyderabad), తెలంగాణ నమూనా 450 ఏండ్ల క్రితం కులీ కుతుబ్ షా కాలంలోనే ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత నిజాం సర్కార్, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి.. ఆ వరుసలో ఇప్పుడు తాను వచ్చానని అన్నారు. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా?.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ (చంద్రశేఖర్ రావు) కట్టారా..? అని ఉదహరించిన సీఎం రేవంత్.. హైదరాబాద్‌లోని ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏళ్ల క్రితమే ఉనికిలోకి వచ్చినవన్నారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కొనసాగిందని, ప్రపంచంలోనే అత్యుత్తమైన గాజులు, ముత్యాలు హైదరాబాద్‌లో చార్మినార్ దగ్గర దొరుకుతాయని ఉదహరించారు. ఇప్పుడు జరుగుతున్న డాలర్ల మార్పిడికి 400 ఏళ్ల క్రితమే పునాది పడిందని, అప్పట్లోనే నగదు మార్పిడి జరిగిందని, ప్రపంచంలోని ఏ దేశ కరెన్సీ నోటు తీసుకొచ్చినా మార్చుకునే వ్యవస్థ అమలైందన్నారు. హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు గతంలోనే తాను వినతిప్రతం ఇచ్చి హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలని కోరానని రేవంత్ గుర్తు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు మే నెలలో హైదరాబాద్‌లో జరగబోతున్నాయని, ఇలాంటప్పుడు ఒలింపిక్స్ ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. అహ్మదాబాద్.. హైదరాబాద్ ఏదో తేల్చుకోవాలని ఒలింపిక్స్ ప్రతినిధులకు రేవంత్‌రెడ్డి సూచిస్తున్నారని ప్రశ్నించవచ్చా అని రాజ్‌దీప్ సర్దేశాయి అడగ్గా.. ‘అహ్మదాబాద్ కు నరేంద్రమోదీ బ్రాండ్ అంబాసిడర్.. హైదరాబాద్ బ్రాండ్‌ను సీఎంగా ఎక్కడికి తీసుకెళతానో చూడండి’ అని రేవంత్‌రెడ్డి బదులిచ్చారు.
ఇతర రాష్ట్రాలకూ అవకాశం ఇవ్వాలి
ప్రధానమంత్రి మోదీని తాను ప్రశ్నిస్తే గుజరాత్‌పై దాడిగా కొందరు మాట్లాడుతున్నారని, ఆయన వికసిత్ భారత్ గురించి మాట్లాడుతుంటే తాను తెలంగాణ మోడల్ గురించి చెబుతున్నానని అర్థం చేసుకుంటున్నారని సీఎం రేవంత్ ప్రస్తావించారు. దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి గిఫ్ట్ సిటీకి ఎందుకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారని ప్రశ్నించారు. గిఫ్ట్ సిటీకి ఇచ్చే ప్రయోజనాలు హైదరాబాద్ కు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
ఆర్థిక కష్టాల్లోనూ గ్యారంటీల అమలు
తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.69 వేల కోట్ల ఉన్న అప్పు కేసీఆర్ పదేండ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు చేరుకున్నదన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నెలకు ఆదాయం రూ.18,500 కోట్ల ఆదాయం వస్తున్నదని, ఇందులో జీతాలు,పింఛన్లకు నెలకు రూ.6,500 కోట్లు, గత ప్రభుత్వం చేసిన అప్పుల, వడ్డీలకు రూ.6,500 కోట్లు ఖర్చవుతున్నదన వివరించారు. ప్రతి నెలా పదో తేదీ లోపు రూ.13 వేల కోట్లు చొప్పున కట్టాల్సి వస్తున్నదన్నారు. మిగిలిన రూ.5 వేల కోట్లతోనే అభివృద్ధి, సంక్షేమం చేపట్టాల్సి వస్తున్నదన్నారు.
మోదీని ఎవ్వరూ ప్రశ్నించరెందుకు?
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల గురించి ప్రస్తావించే ముందు గత ప్రభుత్వ అప్పులకు తిరిగి చెల్లించే గ్యారంటీల గురించి చెప్పక తప్పదని సీఎం, వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయబోమని తాను చెప్పడం లేదని, ఆ పరుగు సాగుతూ ఉన్నదని, దీన్ని ఇలాగే సాగనివ్వాలన్నారు. వేగం ఉత్తేజాన్నివ్వడంతో పాటు చంపేస్తుందనేది (స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్) అని అన్నారు. మోదీ గ్యారెంటీలకు వ్యతిరేకమైతే .. ఢిల్లీలో ఎందుకు గ్యారంటీల మీద హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.
హామీలపై దేశవ్యాప్త చర్చ జరగాలి
పార్టీలు ఇచ్చే హామీలు, ఉచితాలపైనా దేశవ్యాప్తంగా చర్చ జరగాలని సీఎం రేవంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. క్యాపిటల్ ఎక్సెపెండిచర్‌పై చర్చ జరగాలన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఒక తీరులో ఉంటే, కాంగ్రెస్ కులగణన ద్వారా ఇలాంటి ప్రయోజనాలు పొందాలనుకుంటున్నదా అని సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయి ప్రశ్నించగా, జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ లెక్కలు చేస్తున్నప్పుడు బీసీ లెక్కలు ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందనేదే తమ అభిప్రాయమని, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చిందని, ఇప్పుడు ఓబీసీలకు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. ఎలాగైనా రిజర్వేషన్లు ఇస్తామని, మండల్ కమిషన్ 29% రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు ఇంకా పెంచి 42% చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వంలో ఎంత మంది మైనారిటీలు ఉన్నారో చెప్పండని ఎదురు ప్రశ్నించిన సీఎం రేవంత్… స్వాతంత్య్ర ఉద్యమంలో మైనారిటీలు పాల్గొనలేదా… అమరులు కాలేదా..? ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదో అడగండి? అంటూ ప్రశ్నించారు. రంజాన్ సమయంలో ముస్లిం ఉద్యోగులను గంట ముందు పంపించడం బుజ్జగింపు చర్య కాదని మోదీ వ్యాఖ్యానించారు. దసరా, నవరాత్రి, శివరాత్రిని ప్రజలు జరుపుకోవడం, ప్రభుత్వం హిందు ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు ఇవ్వడంలేదా అని ప్రశ్నించారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామన్నారు.
హిందీని బలవంతంగా రుద్దొద్దు
హిందీ అధికార భాష కాదని, ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమేనని అన్నారు. హిందీ తర్వాత తెలుగు, బెంగాలీ భాషలను ఎక్కువ మంది మాట్లాడతారని పేర్కొన్నారు. హిందీ కోసం మోదీ, అమిత్ షా ఎందుకు పట్టుపడుతున్నారని ప్రశ్నించారు. అది సమంజసమైతే తెలుగు, బెంగాలీ భాషల విషయంలోనూ వర్తించాలన్నారు. హిందీ ఆప్షనల్‌గా ఉంటే ఎలాంటి ఇబ్బందీ లేదని, కానీ బలవంతంగా రుద్దడాన్నే తప్పు పడుతున్నామన్నారు.
బీజేపీకి ‘నైస్’ అస్త్రాలు
బీజేపీకి ఈడీ, సీబీఐ, ఐటీ అనుబంధ సంస్థలుగా ఉన్నాయన్నారు. ‘నైస్’ (నార్కొటిక్స్, ఇన్‌కంటాక్స్, సీబీఐ, ఐడీ) తో పోరాడితే జైలుకు పోతారని, ఐస్ మార్గాన్ని ఎంచుకుంటే బీజేపీ టిక్కెట్ వస్తుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. కానీ బీజేపీలో ఆ పరిస్థితి లేదన్నారు.
పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు
ప్రధానమంత్రితో సన్నిహితంగా ఉన్నందున పార్టీ అగ్రనాయకత్వం గుర్రుగా ఉందంటున్నదనే ప్రశ్నకు సీఎం రేవంత్ బదులిస్తూ, ‘పార్టీ వేరు.. ప్రభుత్వం వేరు.. ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయి’ అని రేవంత్ పేర్కొన్నారు. తాను ప్రధానితో ప్రభుత్వ తరఫున ప్రతినిధిగానే మాట్లాడతానని చెప్పారు. అదానీ స్కిల్ వర్సిటీకి రూ. 100 కోట్లు విరాళం ప్రకటిస్తే బీఆర్ఎస్, బీజేపీ వ్యతిరేకించాయని చెప్పారు. మరి అదానీ నుంచి బీజేపీ తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదని ప్రశ్నించారు.
భద్రాచలానికి మోదీని ఆహ్వానించా
మహా కుంభ్‌మేళా గురించి చాలా చర్చ జరుగుతున్నదని, నిజానికి ప్రధాని మోదీని, అమిత్‌షా ను భద్రాచలానికి రావాల్సిందిగా ఆహ్వానించానని, కానీ రాలేదన్నారు. కుంభమేళాకు తాను వెళ్లలేదని, తన కుటుంబం వెళ్లిందన్నారు. ఇక్కడ కూడా రామమందిరం ఉన్నదని, పరమ పవిత్ర క్షేత్రమని తాను నమ్ముతామన్నారు.