bc jac
సూపర్ ఎక్స్‌క్లూజివ్

BC JAC: బీసీ జేఏసీ కాదు.. తీన్మార్ డ్రామా – తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్?

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం
కులగణనతో ఊపందుకున్న బీసీ వాదం
రాజ్యాధికారం కోసం నాయకుల పట్టు
జాక్ పేరుతో ఉద్యమ బీసీ నేతలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందా?
తెర వెనుక బీజేపీ, బీఆర్ఎస్.. తెరపైకి కొత్త ముఖాలు
పటేళ్లను ముందు పెడితే తమ పని ఖతమేనంటున్న మిగతా బీసీ నేతలు
ఈ రాజకీయ పోరులో సయోధ్య కుదిరేనా?


తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రం(Telangana)లో ప్రభుత్వం(Govt) చేపట్టిన కులగణన(Cast Census)తో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. కులగణన మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ బీసీ(BC)లు మాత్రం ఏకమయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజ్యాధికారం(Political Power) కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదంటే గతంలో లాగానే ఈ నినాదం చల్లారిపోతుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్(Congress) హైకమాండ్(High Command) చేసిన సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలను ప్రకటించింది. ఈ జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభాను 56 శాతంగా ప్రకటించారు. ఈ లెక్కలు తప్పంటూ బీసీ సంఘాలు(BC Unions) విమర్శించాయి.

పురుడుపోసుకున్న బీసీ జేఏసీ


రాజ్యాధికారం కోసం బీసీ సంఘాలు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన కులగణన లెక్కలతో మరోసారి ఈ డిమాండ్ ఊపందుకున్నది. మరోవైపు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కులగణనను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నివేదికను ఒప్పుకొనేది లేదేంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాల మధ్యే బీసీల చైతన్య సదస్సు జరిగింది. ఒక బీసీ జేఏసీ(BC JAC) పురుడుపోసుకున్నది. వెనుక బడిన వర్గాలకు జాయింట్ యాక్షన్ కమిటీ వేదిక అవుతుందా? రాజకీయ ఆశయాలు నెరవేర్చి, బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా విజయం సాధిస్తుందా? అనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధించడం, రాజ్యాధికారం సాధించడమే ఇప్పుడు జేఏసీ ముందున్న టాస్క్.

గతంలో బీసీ ఉద్యమాలు సాధించిందేంటి?

ఉమ్మడి ఏపీలోనూ బీసీ ఐక్యతా ఉద్యమాలు బలంగానే జరిగాయి. గౌతు లచ్చన్న(Goutu Lachhanna), కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji), జేబీ కేశవులు(JB Keshavulu) లాంటి నేతలు తొలి తరం బీసీ నేతలుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కాలంలో ఆర్ కృష్ణయ్య( R krishnaiah), కే కేశవరావు, డీ శ్రీనివాస్, వకుళాభరణం కృష్ణ మోహన్ తదితరులు మలితరంలో బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2009‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో దేవేందర్ గౌడ్(Devender Goud) నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించారు. ఆయన టీడీపీలో నంబర్ 2 నేతగా ఉండటం, మంచి వక్త కూడా కావడంతో కొంతమేర బీసీ నేతలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు. కానీ, తర్వాత ఆయన తన పార్టీని ప్రజారాజ్యంలో కలిపి చేతులు ఎత్తేశారు. మరోవైపు, బీసీ రాజ్యాధికార సమితి పేరుతో నారగోని ఆధ్వర్యంలోనూ కొంత కాలం సమావేశాలు కొనసాగాయి.

బీసీల కోసం గత ప్రభుత్వాలు ఏం చేశాయి?

1982లోనే బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మురళీధర్ రావు(Muralidhar Rao) నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌(One Man Commission)ను నియమించింది. ఆయన నివేదికను ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు(NT RamaRao) అమలు చేశారు. జీవో 186(GO 186) తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు  అమలుచేశారు. ఆ తర్వాత వాటిని వ్యతిరేకిస్తూ అగ్రకులాలు నవ సంఘర్షణ సమితి పేరుతో ఉద్యమాలు చేశాయి. అదే సమయంలో బీసీలు రిజర్వేషన్లను బలపరుస్తూ సమ సంగ్రామ పరిషత్‌ను సమాంతరంగా ఉద్యమాలు చేసింది. కానీ తర్వాత కాలంలో కోర్టు ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చింది. మండల్ కమిషన్ వేయడం.. ఓబీసీలకు 27 శాతం సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. అది దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక ఉద్యమాలకు వేదిక అయింది. అలాగే దేశవ్యాప్తంగా బీసీల ఐక్యతకూ ఇది బీజం వేసింది. తాజాగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కూడా ఒకటి. జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టడం, కులాల వారీగా ప్రకటించాక, బీసీల్లో కొంత అసమ్మతి కనిపిస్తున్నది. దీనిని తీన్మార్ మల్లన్న అవకాశంగా మలుచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన నేతృత్వంలో బీసీ ఐక్య వేదిక పేరుతో సమావేశం కావటం జేఏసీ అంటూ కండువాలు ధరించటం చూస్తుంటే మరో బీసీ రాజకీయ వేదిక సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే, సమావేశంలో ఉద్యమ బీసీ నాయకులు ఎవరూ కనిపించ లేదు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయని అనుకుంటున్నారు. వీరిలో ఎంతమంది మల్లన్నను నమ్ముతారనేది పెద్ద ప్రశ్నే.

రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకుంటాయా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీల్లో ఐక్యత వస్తుందా? రాజకీయంగా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం వైపు పయనిస్తారా? అనేది తేలాల్సి ఉంది. లేదంటే వీరు నడిపే ఐక్యతా ఉద్యమాన్ని ఇతర రాజకీయ పార్టీలు, వ్యక్తులు ప్రభావితం చేసి తమకు అనుకూలంగా మార్చకుంటారా అన్న చర్చ కూడా జరుగుతున్నది. ఇప్పటికే తేనెతుట్ట కదిలింది. ఈ ఉద్యమం ఎటువైపు పోతుంది? కుటుంబ పార్టీగా ముద్రపడిన బీఆర్ఎస్ ఏం చేస్తుంది, తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్ల రాజకీయమే చెల్లుతుందనే వాదన ఉంది. ఇక ఎలాగైనా ఈ సారి తెలంగాణలో అధికారం కోసం కాచుకు కూర్చున్న బీజేపీ ఈ బీసీ వాదాన్ని వాడుకుంటుందా అనేది ఆసక్తికరం. మొత్తం మీద ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు రాజకీయ ఎజెండా సిద్దమైనట్లు కనిపిస్తున్నది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్