జనవరి 26న నాలుగు స్కీమ్‌లు ప్రారంభం
నెల రోజులు దాటినా అమలు అసంపూర్ణం
మూడెకరాలకే రైతుభరోసా నిధులు రిలీజ్
ఒక్క ఫేజ్‌కే పరిమితమైన ఆత్మీయ భరోసా
వాయిదా బాటలో రేషన్ కార్డుల పంపిణీ
పునాది కూడా పడని ఇందిరమ్మ ఇండ్లు
ఆశల పల్లకీలో అర్హులైన లబ్ధిదారులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున ఒకేసారి నాలుగు పథకాల (Govt Schemes)ను ప్రారంభించిన ప్రభుత్వం (TG Govt) వాటి అమల్లో (Implementation) వెనకడుగు వేస్తున్నదన్న విమర్శలు (Criticism) వస్తున్నాయి. విపక్షాల (opposition Parties) నుంచి విమర్శలు ఎలా ఉన్నా లబ్ధిదారుల్లో మాత్రం అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉన్నది. రైతుభరోసా (Raithu Bharosa) డబ్బుల కోసం రైతులు(Farmers) మొబైల్ ఫోన్లు దగ్గరపెట్టుకొని ఎస్ఎంఎస్ (SMS) కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డు(New Ration Cards) కు దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితి ఇదే. ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Illu)కు టోకెన్ పద్ధతిలో లబ్ధిదారుల (Eligible Candidates) ఎంపిక మొదలైనా ఆర్థిక సాయం ఎందరికి అందుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇక రైతుకూలీలకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Athmiya Bharosa) పేరుతో ఏటా రూ.12 వేల సాయంలో ఈ సీజన్‌కు ఇచ్చే రూ. 6 వేలు ఒక ఫేజ్‌కే పరిమితమైంది.
రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
నాలుగు స్కీమ్ (Four Schemes) లలో రేషన్ కార్డులు మినహా మిగిలిన మూడూ ఆర్థిక అంశాలతో ముడిపడినవి. నిధుల (Funds) సమీకరణ కోసం ప్రభుత్వం ఆలస్యం (Delay) చేస్తున్నదనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా గత ప్రభుత్వం (BRS Govt) చేసిన అప్పులకు వడ్డీని కట్టడానికే అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ప్రజలకు అర్థమయ్యే తీరులో సందర్భం వచ్చినప్పుడల్లా వివరిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు నిధులతో సంబంధం లేకపోయినా లబ్ధిదారుల చేతికి అందకపోవడం, ముహూర్తం ఖరారు కాకపోవడంతో సరికొత్త సందేహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌లేని జిల్లాల్లో మార్చి1న ప్రారంభిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాయిదా పడింది. పౌరసరఫరాలతో పాటు సాగునీటిపారుదల మంత్రి బాధ్యతలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తున్నందున దాదాపు వారం పాటు నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ (Tunnel) ప్రమాద ఘటన సహాయక చర్యల (Rescue) పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. రెండు రోజులుగా ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్నారు. దీంతో మంత్రి సమయం కోసం రేషను కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందేమోననే చర్చలు సాగుతున్నాయి. దరఖాస్తుదారుల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది.
విపక్షాలకు అస్త్రంగా ‘రైతుభరోసా’
రైతుభరోసా విషయంలో మూడెకరాల సాగుభూమి ఉన్న రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కానీ బ్యాంకర్ల (Bankers)తో జరిగిన సమావేశం సందర్భంగా మూడెకరాల భూమి ఉన్న రైతులకు వీలైనంత తొందరగా అందించాలని డిప్యూటీ సీఎం (Deputy CM), ఆర్థిక మంత్రి (Finance Minister) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. మూడెకరాలలోపు భూమి ఉన్నా రైతుభరోసా నిధులు జమ కాలేదని రైతుల్లో అసంతృప్తి ఉన్న సమయంలోనే ఇద్దరు మంత్రుల (Ministers) వేర్వేరు ప్రకటనలతో గందరగోళం పెరిగింది. సరిగ్గా అవకాశం కోసం కాచుకుని కూర్చున్న విపక్షాలకు అస్త్రం (Weapon) దొరికినట్లయింది. ఎట్టిపరిస్థితుల్లో మార్చి 31వ (March 31) తేదీలోగా అర్హులైన రైతులందరికీ రైతుభరోసా నిధులను జమ చేస్తామని డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారు. ఇక రైతు కూలీలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం కూడా ఒక్క ఫేజ్‌కే పరిమితమై అసంపూర్తిగా మిగిలిందనే అభిప్రాయం నెలకొన్నది.
ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతున్నది?
నెల రోజులు దాటినా ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదన్న ప్రజల అసంతృప్తికి, విపక్షాల విమర్శలకు మంత్రులు, ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ‘మీ సేవ’ (Mee seva) కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు, స్పష్టమైన సమాచారం లేకపోవడంతో మళ్లీ మళ్లీ అప్లై చేసుకోవాలనే భావనతో జనం క్యూ కట్టడం.. ఆ తర్వాత ఆలస్యంగా ప్రభుత్వం వివరణ ఇవ్వడం.. ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్‌తో కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ మొదటి నుంచీ గందరగోళంగా మారింది. ఈ వారంలోనే క్యూ ఆర్ కోడ్ (QR code)తో స్మార్ట్ కార్డులను జారీచేస్తామని పౌర సరఫరాల శాఖ(Civil Supplies Department) అధికారులు చెప్తున్నా ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం కుదరడంలేదు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించినా ఆచరణ మాత్రం నత్తనడకన సాగుతున్నదనే అపవాదు నెలకొన్నది.