= అక్రమ మైనింగ్‌పై సర్కారు కఠిన చర్యలు
= ప్రభుత్వ ఖజానాకు గండికొడితే ఉపేక్షించొద్దు
= మినరల్ బ్లాకుల వేలానికి త్వరలో టెండర్లు
= గనుల శాఖపై అధికారులతో సీఎం సమీక్ష
= ఇసుక అక్రమాల కట్టడితో పెరిగిన రెవెన్యూ
= నెల రోజుల డ్రైవ్‌పై సీఎంకు ఆఫీసర్ల వివరణ
Illegal Mining : తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్రంలో వివిధ రకాల ఖనిజ తవ్వకాలలో జరుగుతున్న అక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలపై సీరియస్‌గా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మైనర్ మినరల్ బ్లాకుల వేలం ప్రక్రియకు త్వరలో టెండర్లను పిలవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా సాధించిన ఫలితాలను రివ్యూ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఖనిజాల విషయంలోనూ అదేతరహా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, అక్రమాలను ఉపేక్షించకుండా ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టం చేశారు. ఖనిజశాఖపై అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ రంగం ద్వారా ప్రభుత్వానికి (Govt) వస్తున్న ఆదాయం.. అక్రమాలతో ఏ మేరకు గండి పడుతున్నదో అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపైన అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా దిశానిర్దేశం చేశారు.
సీరియస్ యాక్షన్‌తోనే..
వివిధ రకాల ఖనిజాల తవ్వకాల్లోనే కాకుండా సరఫరాలోనూ జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టి కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కిచెప్పారు. సీరియస్ యాక్షన్‌తోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచగలమని స్పష్టం చేశారు. గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా వస్తున్న ఆదాయం.. అక్రమాలను నిలువరిస్తే ఏ మేరకు పెరుగుతుందో అధికారుల నుంచి వివరాలను సేకరించారు. రాష్ట్ర మైనింగ్ శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, చేసిన వసూళ్లు, నమోదైన కేసులు, కోర్టు పరిధిలో ఉన్న అంశాలు తదితరాలపై అధికారుల నుంచి సీఎం వివరాలను తీసుకున్నారు. విధానపరమైన నిర్ణయాన్ని వీలైనంత తొందరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట..
ఇసుక విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగిందని ఆఫీసర్లు సీఎంకు వివరించారు. ఇసుక రీచ్‌లలో జరుగుతున్న తవ్వకాలు, స్టాక్ పాయింట్లలో రికార్డులను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా పెరిగిన జవాబుదారీతనం, అక్రమంగా జరిగే వసూళ్లకు బ్రేక్, వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా సరఫరా కావడం.. ఇలాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.
కార్పొరేషన్ ద్వారానే ఇసుక సరఫరా..
నెల రోజుల స్పెషల్ డ్రైవ్, తనిఖీలతో ఇసుక ద్వారా ప్రభుత్వానికి అదనంగా వచ్చిన ఆదాయాన్ని ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖలతో పాటు వివిధ డిపార్టుమెంట్లు చేపట్టే నిర్మాణాలకు రాష్ట్ర మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఇసుక సరఫరా కావాలని సీఎం ఆదేశించారు. భారీ స్థాయి నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ఇసుకను ఈ కార్పొరేషన్ ద్వారానే సరఫరా చేయడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ధరలకే ఇసుకును సరఫరా చేస్తే అక్రమ దందా బంద్ అవుతుందని, వినియోగదారులకు తక్కువ ధరకే లభిస్తుందని, ప్రభుత్వ ఖజానాకూ ఆదాయం సమకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వినియోగంపై లెక్కలను అధికారులు వివరించగా ఎక్కువగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనే ఉన్నట్లు తేలింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరానికి మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను వీలైనంత తొందరగా ఏర్పాటు చేయాలని, ఫలితంగా తక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుందని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ శశాంక, గనుల శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్ పాల్గొన్నారు.