TG High Court: అసలే థియేటర్లకు జనాలు రావడం లేదు బాబోయ్ అని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యాజమాన్యం లబో దిబో అంటుంటే.. 16 సంవత్సరాల లోపు పిల్లలకు రాత్రి 11 గంటల తర్వాత, ఉదయం 11 గంటల లోపు థియేటర్లలోకి అనుమతించవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు థియేటర్ల యాజమాన్యం నెత్తిన పిడుగు పడినట్లయింది. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ ఏజ్ పిల్లలు రాకపోతే, వారి తల్లిదండ్రులు కూడా సినిమాలకు రారు? ఎలా రా దేవుడా? అనుకుంటున్న తలపట్టుకుంటోన్న వారికి, తెలంగాణ హైకోర్ట్ ఆ ఉత్తర్వులను సవరిస్తున్నట్లుగా ప్రకటించి సంతోషాన్నిచ్చింది. విషయం ఏమిటంటే..
Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్
16 సంవత్సరాల లోపు పిల్లలను నిర్ధిష్ట సమయం ప్రకారమే సినిమా థియేటర్లలోకి అనుమతించాలంటూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి ఆంక్షలు ఉండవని సవరణలో పేర్కొంది. జనవరి 21న ఇచ్చిన తీర్పులో ఇకపై 16 సంవత్సరాల లోపు పిల్లలకు రాత్రి 11 గంటల తర్వాత, ఉదయం 11 గంటల లోపు థియేటర్లలోకి అనుమతించవద్దంటూ హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే అదే సమయంలో చెప్పిన ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు మాత్రం అనుమతి నిరాకరించింది. ‘గేమ్ చేంజర్’ సినిమాకు ప్రభుత్వం ప్రత్యేక షో అనుమతించడంపై గత విచారణలో వాదనలు పోటాపోటీగా జరిగాయి. ప్రత్యేక షోలకు అనుమతించడం వల్ల తొక్కిసలాటలు జరుగుతున్నాయన్న పిటీషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు, ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల లోపు పిల్లలు అర్ధరాత్రి షోలు చూడటం వల్ల వాళ్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతూ ఆంక్షలు విధించింది. ఈ విషయమై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం పిటీషన్
హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర పిటీషన్ దాఖలు చేశారు మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం. 16 ఏళ్ల లోపు పిల్లల ప్రవేశంపై ఆంక్షలతో ఆర్థికంగా నష్టపోతున్నామని వారు పిటీషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పిటీషనర్లు కోరారు. వారి వాదనలను పరిగణలోకి తీసుకొని ఉత్తర్వుల్లో హైకోర్టు సవరణ చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు 16 ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లలోకి ప్రవేశం లేదనే ఆంక్షలను హైకోర్టు తొలగించింది. కేసు తదుపరి విచారణను మార్చి 17కు కోర్టు వాయిదా వేసింది.