– పోలీసుల ముందుకు సంధ్యా శ్రీధర్ రావు
– ఇంటికొచ్చి బెదిరించిన రాధాకిషన్ రావు
– కోట్లు లాక్కుపోయాడన్న వ్యాపారి
– పోలీసు విచారణలో ముగ్గురు ఎస్సైలు
– పాత్రధారుల సమాచారంతో సూత్రధారులపై నజర్
– వరుస సాక్ష్యాలతో దూకుడుగా దర్యాప్తు బృందాలు
– మనీలాండరింగ్ పేరుతో ఈడీ ప్రవేశంపై చర్చ
– బలమైన టెక్నికల్ సాక్ష్యాల సేకరణ
A New Angle In The praneetrao Phone Tapping Case: తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నాటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటీ బయపడుతున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్‌లో పని చేసిన భుజంగరావు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన తిరుపతన్నలతో బాటు సీఐ ప్రణీత్ రావులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరి అరాచకాలకు బాధితులుగా మిగిలిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా కన్‌స్ట్రక్షన్ యజమాని శ్రీధర్ రావు పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శ్రీధర్ రావును ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్‌కి పిలిచి పలు వివరాలు ఆరాతీశారు.
పోలీసుల విచారణలో శ్రీధర్ రావు పలు సంచలన వాస్తవాలను బయటపెట్టారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డిసీపీగా పనిచేసిన రాధా కిషన్ రావు తన ఇంటిలో అక్రమంగా ప్రవేశించి, తమను బెదిరించి కోట్లాది రూపాయలు తీసుకుపోయారని శ్రీధర్ రావు వెల్లడించారు. అంతేగాక అడిషనల్ ఎస్పీ భుజంగరావు తన ఫోన్‌ను ట్యాప్ చేశాడనీ, తన ఆఫీసుకు పిలిపించి, తనను బెదిరించాడని కూడా శ్రీధర్ రావు పోలీసులు చెప్పటంతో బంజారాహిల్స్ పోలీసులు ఆయన స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అధికారులు తనను ఎంతగా వేధించారో, వీరు చేసిన అక్రమాలు ఏ స్థాయిలో నడిచాయో త్వరలోనే తాను ఓ మీడియా సమావేశం పెట్టి వివరిస్తానని శ్రీధర్ రావు తెలిపారు.
Read Also: రాడిసన్ కేసులో తొలి క్రొమటోగ్రఫీ పరీక్ష ఇదే
మరోవైపు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించే క్రమంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల వేళ నగదును తరలించినట్లు అంగీకరించటంతో కేసు కొత్త మలుపు తిరిగింది. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాధాకిషన్‌రావు చేసిన ఈ నగదు తరలింపు వ్యవహారంలో మరోసారి ఆయనను విచారించాలని పోలీసులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌రావును కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని, విచారించేందుకు సిద్ధమైన పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే ఒక ప్రశ్నావళిని తయారుచేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన్ను కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆయన నోరు విప్పితే పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపుకు ఆదేశం ఇచ్చిందెవరు? ఎన్ని దఫాలు, ఎంత నగదు తరలించారు? ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేశారు? ఎవరికి అందజేశారు? ఆ నగదును ఎవరు ఏర్పాటు చేశారు? ఈ కుట్రలోని ఇతర భాగస్వాములు ఎవరు? అనే ప్రశ్నలకు జవాబులు వస్తాయిని, దాంతో అసలు సూత్రధారులను పట్టుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీగా అక్రమ నగదు తరలింపు జరిగి ఉంటే.. ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు, ఐ న్యూస్ ఎండీ శ్రవణ్‌రావులతో బాటు మరో ఐదుగురు ఎస్సైలు కూడా కీలక భాగస్వామలేనని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఎస్సైలు ఇప్పటికే విచారణకు హాజరు కాగా తాజాగా మరో ముగ్గురిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్లు తెలిసింది. వీరు ఎస్‌ఐబీలో పనిచేశారా లేదా రాధాకిషన్ వ్యక్తిగత టీమ్ సభ్యులా? పెద్దలు చెప్పిన వ్యక్తులను బెదిరించి వసూళ్లు చేసే పనికే పరిమితమయ్యారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తిరుపతన్న, భుజంగరావు వాడిన మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వాటిలోని డేటాను తొలగించినట్లు గుర్తించి, ఆ డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారపు పరిధి రోజురోజుకూ విస్తరించటంతో బలమైన టెక్నికల్ సాక్షాలను సేకరించటమే లక్ష్యంగా ఈ సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి.