SLBC Tragedy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటన విషాదాంతమైంది. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు అందులోనే సజీవ సమాధి అయ్యారు. గత శనివారం ప్రాజెక్టు పనుల్లో భాగంగా కార్మికులు, సిబ్బంది టన్నెల్ లోపల ఉన్న సమయంలోనే పై కప్పు కులడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దాదాపు 50 మంది సొరంగం లోపల ఉండగా 42 మంది బయటపడ్డారు. మిగిలిన ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. NDRF, SDRF, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్స్ కార్మికులకు కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినా లోపల చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి.
కాగా, ప్రస్తుతం టన్నెల్ వద్ద మృతదేహాల ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు మూడు మృతదేహాలను ఇప్పటికే వెలికితీసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా ఆస్పత్రి నుంచి నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు టన్నెల్ వద్ధకు చేరుకున్నారు.
ఇక అంతకు ముందు ఈ రోజు ఉదయం రెస్క్యూ టీం లోపలి వెళ్లేందుకు అడ్డంగా ఉన్న బోరింగ్ మిషన్ ను పూర్తిగా తొలగించింది. టన్నెల్ పొడవు.. 120 మీటర్లు కాగా, 1,500 టన్నుల బరువున్న టీబీఎంను ముక్కలుగా కోసిన నిపుణులు వాటిని పక్కకు తప్పించి ముందుకు వెళ్లారు. టన్నెల్ లోని పరికరాలు, టీబీఎం వ్యర్థాలను లోకో రైల్ వ్యాగన్లలో తరలించారు.