Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో కమిటీ ఫిబ్రవరి 5న మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. ;12వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోరింది. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాజాగా చర్య తీసుకుంది.
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే కుల గణన విషయంలో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలకు చేశారు. సర్వే తప్పుల తడకగా ఉందని, బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో అలాగే బహిరంగ సభల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సర్వే నివేదికను లైవ్ లో తగులబెట్టారు. అంతటితో ఆగక ఓ వర్గం పై పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దింతో ఆగ్రహించిన పార్టీ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. అయినా వాటిని బేఖాతరు చేయడంతో ఇప్పుడు సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉంటే… కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చిన మరునాడే మల్లన్న సస్పెండ్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
స్పందించిన పీసీసీ ఛీఫ్
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మల్లన్న విషయంలో ఏఐసీసీనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యహరించే వారికి ఇది ఒక హెచ్చరిక అంటూ నాయకులు, కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పన్నారు.
Also Read:
Multiplex: మల్టీప్లెక్సులకు బిగ్ రిలీఫ్… కీలక ఆదేశాలిచ్చిన హైకోర్టు