Multiplex: మల్టీప్లెక్స్‌లలో16 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించడం పై హైకోర్టు (Telangana High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని తెలిపింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించింది. దీంతో మల్టీప్లెక్సులకు ఊరట లభించింది.
సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు .. జనవరి 21న కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్ధరాత్రి పూట షోలకు వెళ్లడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది.
అయితే … హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకు హైకోర్టు విధించిన అంక్షలను ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవరకూ 16ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. ఈ విషయంపై అన్నివర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.