Revanth : కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై kishan reddy) సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి ( తెలంగాణ పాలిట సైంధవుడిగా మారాడని.. అన్ని పనులను అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు. కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణకు చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా నిధులు వెళ్తున్నాయని.. కేంద్రం మాత్రం ఇచ్చిందేమీ లేదని చెప్పుకొచ్చారు.
‘ఒక ముఖ్యమంత్రి ఇన్ని సార్లు ప్రధాన మంత్రి వద్దకు వెళ్లి అడుగుతున్నా సరే ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు మంజూరు చేయట్లేదు. సీఎంగా నేను వెళ్లి అన్ని సార్లు కలుస్తుంటే.. బీజేపీకి చెందిన మంత్రులు మాత్రం తమను కలవట్లేదని కేంద్ర కేబినెట్ మంత్రులు అంటున్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే ముందుకు వెళ్లనివ్వట్లేదు. కేసీఆర్ తో కలిసి పనిచేసిన ఆయన.. ఇప్పుడు నాకు పేరొస్తుందనే ఉద్దేశంతో ఒక్క విషయంలో కూడా సహకరించట్లేదు. ఆ పేరు ఆయన్నే ఉంచుకోమని చెబుతున్నా. తెలంగాణకు మంచి జరిగితే నాకు అదే చాలు. కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు’ అని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.